టీడీపీ వర్సెస్ టీడీపీ.. ఒకే ఒరలో రెండు కత్తులు ఉండేనా..?

 

వైసీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేలు వరుసపెట్టి టీడీపీ పార్టీలోకి చేరుతున్నప్పటికీ.. వారిని వ్యతిరేకించే టీడీపీ నేతలు కూడా చాలా మందే ఉన్నారు. తాము వ్యతిరేకించే నేతలను టీడీపీలోకి రానివ్వకుండా చేయాలని ఎంత ప్రయత్నించినా.. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వారిని బుజ్జగించడం.. వారు కూడా ఏదో నామ్ కే వాస్త్ ఒప్పుకోవడం జరుగుతోంది. అందుకే ఎంత ఒకే పార్టీలో ఉన్న వారి మధ్య ఉన్న విబేధాలు మాత్రం అప్పుడప్పుడు బయటపడుతూనే ఉన్నాయి.

 

అదినారాయణ రెడ్డి-రామ సుబ్బారెడ్డి

 

 

వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయిన ఫస్ట్ లిస్ట్ లో ముందున్న పేరు ఎవరిదంటే ఆది నారాయణ రెడ్డిదే. అసలు ఈయన టీడీపీ ఎంట్రీ ఎప్పుడో జరగాలి కానీ.. రామ సుబ్బారెడ్డి వల్ల అది ఆలస్యమైంది. ఆదినారాయణ రెడ్డిని కనుక పార్టీలోకి తీసుకుంటే తాను పార్టీని వీడతానని రామ సుబ్బారెడ్డి నిర్మొహమాటంగా చెప్పేశారు. దీంతో చంద్రబాబు కూడా ఆదినారాయణ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా చాలా రోజులే ఢిపెన్స్ లో పడేశారు. ఆదినారాయణ రెడ్డి కూడా ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పారు. అయితే ఆఖరికి ఎలాగో చంద్రబాబు రామ సుబ్బారెడ్డిని బుజ్జగించడం.. ఆది నారాయణ టీడీపీలోకి రావడం జరిగిపోయింది. అయితే ఆ తరువాత కూడా ఇద్దరి మధ్య సరైన సఖ్యత లేనే లేదు. ఇటీవలే సిరిగే పల్లి జాతర కార్యక్రమానికి వెళ్లిన రామ సుబ్బారెడ్డి కార్యకర్తలపై దాడులు జరపగా దానికి ఆదినారాయణ రెడ్డి వర్గీయులే కారణమంటూ ఆరోపించారు. దీనికి ఆదినారాయణ రెడ్డి మాత్రం దాడికి తనకు ఎలాంటి సంబంధం లేదని.. రామ సుబ్బారెడ్డితో కలిసి పనిచేయడానికి తాను సిద్దమే అంటూ స్టేట్ మెంట్లు కూడా ఇచ్చారు.


భూమా నాగిరెడ్డి-శిల్పా బ్రదర్స్

 

 

అసలు వైసీపీ ఎమ్మెల్యేల వలసల పర్వం మొదలైందే భూమా నాగిరెడ్డితో అని చెప్పొచ్చు. ఈయన ప్రారంభించిన వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే వైసీపీ నుండి టీడీపీకి వెళ్లిన భూమాకి, అదే పార్టీలో ఉన్న శిల్పా సోదరులకి మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే విబేధాలు ఎప్పటినుండో ఉన్నాయి. దానికి తోడు శిల్పా మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు తుల‌సీరెడ్డి పై దాడి జరుగగా.. దానికి భూమా నాగిరెడ్డి వర్గీయులే కారణమంటూ శిల్పా బ్రదర్స్ మండిపడ్డారు. అంతేనా ఏకంగా చంద్రబాబు నాయుడి దగ్గరికి వెళ్లి భూమాపై ఫిర్యాదు చేశారు. ఇక భూమా కూడా దాడికి నాకు ఎలాంటి సంబంధం లేదంటూ.. ఈయన కూడా చంద్రబాబుకు చెప్పారు. దీంతో చంద్రబాబుకు కూడా వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడం కత్తిమీద సాములా తయారైంది. అయితే తాజాగా.. వీరిద్దరూ కలిసిపోయినట్టు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి టీడీపీ చేరగా.. ఆ కార్యక్రమంలో పాల్గొన్న భూమా, శిల్పా చక్రపాణి ఇద్దరూ మాట మాట కలిపారు. అంతేకాదు చక్రపాణి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, మాజీమంత్రి ఎన్ఎమ్‌డీ ఫరూఖ్‌తో కలిసి పని చేస్తానని చెప్పారు. దీంతో నంధ్యాల రాజకీయాల్లో వేడి చల్లారిపోయిందని అనుకుంటున్నారు. మరి ఎన్నిరోజులు కలిసుంటారో చూడాలి.


జేసీ దివాకర్ రెడ్డి- ప్రభాకర్ చౌదరి

 

జేసీ బ్రదర్స్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో వారికి వారే సాటి. అది ప్రతిపక్ష పార్టీ అయినా సరే.. సొంత పార్టీ అయినా సరే తమకు ఏది చెప్పలనిపిస్తే అది చెబుతారు. ఏం తిట్టాలనిపిస్తే అది తిట్టేస్తారు.  అలాంటి జేసీ బ్రదర్స్ కు, ప్రభాకర్‌ చౌదరికి మధ్య విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. అదికాక అనంతపురం ఎంపీ అయిన తన సోదరుడు జేసీ దివాకర్ రెడ్డికి విషయంలో ప్రభాకర్ చౌదరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, జేసీ ప్రభాకర్ రెడ్డి ఎప్పటినుండో గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్‌ చౌదరి ముఖ్య అనుచరుడు.. డిప్యూటీ మేయర్‌ గంపన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫోన్‌ చేసి బెదిరిస్తున్నాడని.. ఆస్తుల విధ్వంసానికి పాల్పడతామని హెచ్చరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరిద్దరి వర్గపోరు మళ్లీ తారాస్థాయికి వెళ్లిందని సమాచారం. మరి ఇది చల్లారేదెప్పుడో చూడాలి.


గొట్టిపాటి రవి కుమార్- కరణం బలరాం

 

 

తాజాగా గొట్టిపాటి రవి కుమార్ టీడీపీ ఎంట్రీతో మరో వివాదం తెర పైకి వచ్చింది. టీడీపీ లో ఇప్పటికే చాలా మంది మధ్య విబేధాలు ఉండగా ఇప్పుడు తాజాగా గొట్టిపాటి, కరణం బలరాం జోడి కూడా చేరిపోయింది. వీరిద్దరి మధ్య కూడా ఎప్పటినుండో విబేధాలు ఉన్నప్పటికీ మరోసారి అది బయటపడింది. గొట్టిపాటి టీడీపీలోకి చేరిన సందర్భంగా అద్దంకి టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్లెక్సీలను శుక్రవారం రాత్రి గుర్తుతెలియని నిందితులు కొందరు చించివేసారు. దీంతో గొట్టిపాటి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిరసనగా ఆందోళనకు దిగారు. మరోవైపు ఇది కరణం వర్గీయుల పనే అంటూ కొందమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే గొట్టిపాటి మాత్రం ఇది ఎవరో ఆకతాయిల పని అయివుండొచ్చు అని కవర్ చేశారు.

 

మొత్తానికి పైకి కనిపించినవారు వీరు కాగా.. కనపడని వారు పార్టీలో ఇంకా ఎంత మంది ఉన్నారో తెలియదు. ఇంకా ఎంతమంది బయటకు వస్తారో తెలియదు. మరి ఒకే ఒరలో రెండు కత్తులు ఉండవు అన్న సామెత ప్రకారం.. ఒకే పార్టీలో ఉన్న వీరు ఎంతకాలం కలిసి పనిచేస్తారో.. ఎంతమంది చంద్రబాబుకు తలనొప్పిగా తయారవుతారో చూడాలి.