ఏపీకి బీపీ తెప్పించిన మోదీ

 

ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ఇవాళ రానున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నల్ల జెండాలు, ఫ్లెక్సీలతో నిరసన తెలుపుతున్నారు. ‘మోదీ గో బ్యాక్‌’ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. గుంటూరులో జిన్నాటవర్‌ సెంటర్‌ వద్ద టీడీపీ కార్యకర్తలు నిరసనలు తెలిపారు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్లబెలూన్లు ఎగరవేశారు. విశాఖలో సైతం మోదీ రాకపై నిరసనలు వ్యక్తమయ్యాయి. మరో వైపు మోదీ రాకను నిరసిస్తూ విజయవాడ దుర్గా ఘాట్‌ వద్ద సినీ నటుడు శివాజీ జలదీక్షకు దిగారు. మోదీ పర్యటన ముగిసే వరకు ఆయన దీక్ష చేపట్టనున్నారు. ఆయనకు సంఘీభావంగా కృష్ణా నదిలో పలువురు యువకులు దీక్షకు దిగారు. వీరికి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కారెం శివాజీ సంఘీభావం తెలిపారు.

 

 

మోదీ గో బ్యాక్ అంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో మహిళలు రోడ్డెక్కారు. జడ్పీటీసీ శైలజారాణి ఆధ్వర్యంలో మహిళలు, టీడీపీ కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి ఖాళీ కుండలు, నీళ్లతో నిరసనలు తెలిపారు. మోదీ ఏపీ పర్యటనపై టీడీపీ, కాంగ్రెస్‌తోపాటు కొన్ని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఏపీకి అన్యాయం చేసి రాష్ట్రానికి ఏ మొహం పెట్టుకుని వస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నాయి. మోదీ రాకకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. పలు చోట్ల మోదీ దిష్టిబొమ్మను తగులబెట్టి నిరసనలు తెలిపారు. నల్లబ్యాడ్జీలు, కండువాలు ధరించిన నిరసనకారులు ఆందోళన నిర్వహించారు. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మోదీ వ్యతిరేక పోస్టర్లు వెలిసాయి. ఆగ్రహం కట్టెలు తెంచుకున్నట్టుగా జనవాహిని తరలి వస్తుండగా మోదీ పరుగు పెడుతున్నట్టు ఆ పోస్టర్లలో చిత్రీకరించారు. 'నో మోర్ మోదీ' 'మోదీ ఈజ్ మిస్టేక్', 'మోదీ నెవర్ ఎగైన్' అనే స్లోగన్‌లు ఆ పోస్టర్లలో ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటేనే ఏపీ ప్రజలు మోదీ మీద ఎంత గరంగరంగా ఉన్నారో అర్ధమవుతోంది.