వైఎస్ జగన్ మిస్సింగ్.. ఎక్కడున్నారబ్బా?

 

ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆదివారం ఉదయం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, వైసీపీల తీరుపై మండిపడ్డారు. మోదీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవస్థలన్నీ నాశనం చేశారని, అందుకే దేశంలో ఎక్కడికి వెళ్లినా మోదీకి నిరసనలు తప్పడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం చేసి మళ్లీ సెంటిమెంట్‌తో ఆడుకోవడానికి, మనల్ని ఎగతాళి చేయటానికే మోదీ వస్తున్నారని మండిపడ్డారు. కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ వత్తాసు తీసుకుని మాట్లాడుతున్నారని, ఆయన బీజేపీలో వైసీపీ ఏజెంట్ అని విమర్శించారు. ర్యాలీలలో రెండు కుండలను పగులకొట్టాలని... ఒక కుండ మోదీ, రెండో కుండ జగన్‌ కని అన్నారు. ఆ రెండు కుండలు రెండు పార్టీల లాలూచీకి సంకేతమని చెప్పారు.

ఇవాళ రాష్ట్రమంతా నిరసన సెగలతో ఊగి పోతుంటే జగన్ ఎక్కడ దాక్కున్నారో ప్రతి ఒక్కరూ నిలదీయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి జగన్ చేసిందంతా డ్రామా అనేది ఇవాళ్టితో ప్రజలందరికీ అర్థం కావాలన్నారు. ప్రజలంతా మోదీకి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతుంటే జగన్‌ హైదరాబాద్‌లో దాక్కుని కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. వైసీపీ తప్ప అన్నిపార్టీలు నిరసనలు తెలుపుతున్నాయని మండిపడ్డారు. జగన్‌ బీజేపీతో లాలూచీ పడ్డారని విమర్శించారు. మోదీ పర్యటనకు జగన్‌ సహకరిస్తున్నారనే విషయం ప్రతి గ్రామంలో తెలిసేలా చెయ్యాలని చంద్రబాబు నేతలకు పిలుపునిచ్చారు.