టీ-టీడీపీ సీఎం అభ్యర్థిగా కృష్ణయ్య?

 

 

 

తెలంగాణలో సీఎం పదవి బీసీలకే ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేయనున్నట్లు తెలుస్తోంది. బీసీ నాయకుడిగా రాష్ట్రవ్యాప్త గుర్తింపు ఉన్న ఆర్.కృష్ణయ్యను తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు తెలిసింది. దీనివల్ల తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీ వర్గాలకు మరింత చేరువ కావచ్చునని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. 'బీసీని సీఎం చేస్తామని ప్రకటించిన తెలుగుదేశానికే మా మద్దతు' అని ఆర్.కృష్ణయ్య కూడా పేర్కొన్నారు.


అయితే... ఆయన ఇప్పటిదాకా టీడీపీలో అధికారికంగా చేరలేదు. అతి త్వరలోనే కృష్ణయ్యను లాంఛనంగా పార్టీలో చేర్చుకుని... ఆయననే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెలంగాణకు దళితుడే తొలి సీఎం అని ప్రకటించిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్... ఇప్పుడు ఈ విషయంలో వెనుకడుగు వేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీలకు సీఎం పదవి ఇస్తామని ప్రకటించడం ద్వారా మొత్తం బలహీనవర్గాలందరికీ దగ్గర కావొచ్చునని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం!