చంద్రబాబు దారిలో జయలలిత..!

తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె తొలి సంతకం దేనిపై పెడతారా అని ప్రజలు, ప్రతిపక్షాలు ఆసక్తిగా ఎదురుచూశారు. దీనికి జయలలిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఫాలో అయ్యారు. తాము అధికారంలోకి వస్తే తొలి సంతకం రైతు రుణమాఫీ ఫైలుపైనే పెడతామని బాబు ప్రకటించారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన తొలి సంతకం రైతు రుణమాఫీ ఫైలుపై చేశారు. అదే విధంగా జయలలిత కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతు రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేశారు. అంతేకాకుండా కొత్త పథకాలతో వరాల జల్లు కురిపించారు.

 

ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం అల్పాహారం, మద్యం దుకాణాలకు సమయం కుదింపు, వంద యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, చేనేత కార్మికులకు 700 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా పథకాలను జయ మేనిఫెస్టోలో ప్రకటించారు. వీటిలో మద్యం దుకాణాల సమయం కుదింపుపై జయ తన హామీని నిలబెట్టుకున్నారు. అలాగే 500 రిటైల్ మద్యం షాపుల మూసివేతకు అమ్మ ఆదేశాలు జారీ చేశారు. ఇంతక్రితం తమిళనాడులో ఉదయం 10 గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ మద్యం దుకాణాలు తెరిచి ఉండేవి. తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే తెరచుకోనున్నాయి. మిగిలిన కొత్త ఫథకాలు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.