ఆఫీసులో ఉన్నప్పుడు ఇంటి ఫోన్లు వస్తుంటే!

ఆఫీసులో మంచి పనిలో తలమునకలైపోయి ఉంటామా! ఇంటి దగ్గర్నుంచీ ఫోన్ వస్తుంది. అలాగని అదేమీ ఎమర్జన్సీ ఫోన్ కూడా కాదు. ఎలా ఉన్నారో ఓసారి పలకరించేందుకో, సాయంత్రం వచ్చేటప్పుడు కందిపప్పు తెమ్మని గుర్తుచేసేందుకో... చేసిన పోన్. ఇక ఇంట్లో ఫ్యామిలీతో కలిసి హాయిగా భోజనం చేసే సమయంలో సాటి ఉద్యోగుల నుంచి వచ్చే ఫోన్లకీ కొదవ ఉండదు. అది కూడా ఏమంత ఎమర్జన్సీ కాదు. పక్క సీట్లో సుబ్బారావు గురించో, పెరగకుండా మిగిలిపోయిన జీతాల గురించో కావచ్చు.

 

ఇలా ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీసు ఫోన్లు, ఆఫీసులో ఇంటి ఫోన్ల వల్ల... ఇటు కుటుంబ జీవితం, అటు ఉద్యోగ జీవితం ఎంతవరకు ప్రభావితం అవుతున్నాయో చూడాలనుకున్నారు పరిశోధకులు. ఈ విషయాన్ని తేల్చేందుకు ఓ 121 మంది ఉద్యోగులను పదిరోజుల పాటు డైరీ రాయమని అడిగారు. ఆఫీసులో ఏం జరుగుతోంది- దాని వల్ల తన పనితీరు ఎలా ప్రభావితం అయ్యింది, ఇంట్లో ఏం జరుగుతోంది- దాని వల్ల తన కుటుంబ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది... తదితర వివరాలన్నీ ఈ డైరీలో నమోదు చేయమని అడిగారు.

 

ఆఫీసులో ఇంటి ఫోన్లు, ఇంట్లో ఆఫీసు ఫోన్ల వల్ల అటు లాభమూ ఇటు నష్టమూ రెండూ ఉన్నట్లు తేలింది. ఆఫీసులో వచ్చే ఫోన్లతో జాబ్ శాటిస్ఫాక్షన్ లేకపోవడం, పని మీద శ్రద్ధ తగ్గడం, చిరాకు... లాంటి పర్యవసానాలు కనిపించాయి. కానీ కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇంటి నుంచి వచ్చే ఫోన్లతో పనిఒత్తిడి తగ్గడం, కుటుంబసభ్యుల మధ్య అనుబంధం పెరగడాన్ని గమనించారు. పనికీ పనికీ మధ్య ఖాళీ సమయంలోనో, భోజన విరామంలోనో, ఇంటికి వెళ్లే దారిలోనో ఇంటికి చేసే ఫోన్లతో అటు వారితో మాట్లాడినట్లూ ఉంటుంది, ఇటు ఉద్యోగానికీ ఇబ్బంది ఉండదట.

 

ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆఫీసు ఫోన్ల విషయంలో తగినంత జాగ్రత్త ఉండాలంటున్నారు. పక్కన ఎవరూ లేని సమయంలోనో, పిల్లలు పడుకున్న తర్వాతనో సాగే ఆఫీసు ఫోన్లతో పెద్దగా నష్టం ఉండదని సూచిస్తున్నారు. అంతేకాదు! ఆఫీసు అవసరాలకి అనుగుణంగానే తమకు ఫోన్ చేయవలసిందిగా సాటి ఉద్యోగులకి తెలియచేయమంటున్నారు. చిన్న చిన్న విషయాలకి మెయిల్ చేయమనీ, విషయం వెంటనే తెలియాలి అనుకున్నప్పుడు మెసేజ్ చేయమనీ, అత్యవసరం పరిస్థితులలో అయితేనే ఫోన్ చేయమనీ సాటి ఉద్యోగులకు చెప్పి ఉంచమంటున్నారు.

- నిర్జర.