కార్లు అమ్ముకోండి… కాలుష్యం అమ్మటానికి వీల్లేదన్న సుప్రీమ్ కోర్ట్!

 

ఈ భూమ్మీద మనిషితో పాటూ కోటాను కోట్ల జీవులున్నాయంటారు. కాని, మనిషి అంత స్వార్థ జీవి మరొక్కటి కూడా లేదని చెప్పొచ్చు! అందుకు ప్రత్యక్ష ఉదాహరణ కాలుష్యమే! మొదట విపరీతమైన లాభాపేక్షతో, సుఖాల యావతో తన మనన్సుని కలుషితం చేసుకున్న మానవుడు తరువాత యావత్ భూమండలాన్ని కాలుష్యమయం చేస్తున్నాడు. ఇతర జీవులకే కాదు… తనకి కూడా ఈ అందమైన భూమి ఎందుకు పనికి రాకుండా పోయేలా తయారు చేసుకుంటున్నాడు!

 

ప్రకృతి మనకిచ్చిన భూ గ్రహంపై మనిషి చేస్తో్న్న అత్యంత దారుణమైన దాడి వాహన కాలుష్యం. వేగంగా దూరాల్ని దాటేయాలనే ఆలోచనతో అసలుకే మోసం తెచ్చుకుంటున్నాడు! కోట్ల వాహనాలు రోడ్లపై పరుగులు పెడుతూ ఎంత నష్టం చేస్తు్నాయో మనం అస్సలు ఊహించలేకపోతున్నాం. తాజాగా సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే మనకు తీవ్రత అర్థమవుతుంది. వ్యాపారం కోసం బడా కార్పోరేట్లు మనిషి అస్థిత్వమే ప్రశ్నార్థకమైనా పట్టించుకోవటం లేదు!

 

ఏప్రెల్ ఒకటవ తేదీ నుంచి భారత మార్కెట్లలో బీఎస్ 4 వాహనాలు తప్ప బీఎస్ 3 వాహనాలు అమ్మటానికి వీలు లేదని కోర్టు చెప్పింది. ఇంతకీ బీఎస్ అంటే ఏంటి? బీఎస్ అంటే భారత్ స్టేజ్ అని అర్థం. ప్రస్తుతం మన దేశంలో బీఎస్ 3 దశకు సంబంధించిన వాహనాలు కూడా అమ్ముడు అవుతున్నాయి. కోర్టు తీర్పుతో ఇక మీదట కేవలం బీఎస్ 4కు చెందిన వెహికల్స్ మాత్రమే అందుబాటులో వుంటాయి. దీని వల్ల ప్రధానమైన లాభం తక్కువ కాలుష్యం జరగటమే.

 

ఇప్పటికిప్పుడు కాలుష్యాన్ని పూర్తిగా అరికట్టాల్సిన స్థితిలో మన ప్రపంచం వుంది. కాని, వాహనాల ఉపయోగం అమాంతం ఆపేసేది, ఆపేయగలిగేది కాదు. అన్ని దేశాల ఆర్దిక వ్యవహస్థలు వాహనాలు, ఇంధనం వాడకంపైనే ఆధారపడి వున్నాయి. కాబట్టి నిపుణుల అభిప్రాయం ప్రకారం మెల్లమెల్లగా అయినా వాతావరణానికి హాని చేయని వాహనాల్ని వాడాలని. ఆ క్రమంలో వచ్చినవే బీఎస్ 4 వాహనాలు. ఇవ్వి ఇంతకాలం మన దేశంలో తయారైన వాహనాల కంటే తక్కువ కాలుష్యం చేస్తాయి. అందుకు తగ్గట్టుగా సాంకేతిక ఏర్పాట్లు చేశారు బీఎస్ 4 ద్విచక్ర , త్రిచక్ర వాహనాల్లో. బీఎస్ 4 కిందకు వచ్చే కార్లు, ఇతర భారీ వాహనాలు కూడా గతంలో తయారైన వాటికంటే గణనీయమైన స్థాయిలో కాలుష్యాన్ని తగ్గిస్తాయి. ఈ పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకునే మారుతి, సుజుకీ లాంటి అనేక కంపెనీలు ఎప్పట్నుంచో బీఎస్ 4 వాహనాల ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తూ వచ్చాయి. 2010 నుంచీ వాహన తయారీ కంపెనీల్లో ఈ ప్రక్రియ నుడుస్తోంది. కాని, కొందరు ఆటోమొబైల్ తయారీదారులు మాత్రం కాలుష్యాన్ని, సమాజం పట్ల బాధ్యతని మరిచి బీఎస్ 3 వాహనాలే మార్కెట్లోకి విడుదల చేస్తూ వచ్చారు. ఇప్పుడు సుప్రీమ్ కోర్టు తీర్పుతో వారికే ఎక్కువగా నష్టం వాటిల్లుతోంది.

 

బీఎస్ 3 టైపు వాహనాల్ని భారీగా తయారు చేసి వుంచుకున్న కంపెనీలు ఏప్రెల్ ఒకటి తరువాత వాట్ని అమ్మలేవు. వారు బీఎస్ 3 వాహనాల్ని అమ్ముకోటానికి అంగీకరించే ఇతర దేశాలకి ఎగుమతి చేసుకోవాలి. లేదంటే, బీఎస్ 4 ప్రమాణాలకి సరిపోయేలా అప్ గ్రేడ్ చేసుకోవాలి. ఇలాంటి చర్యలన్నిటికి ఎంతో కొంత ఆర్దిక నష్టం భరించక తప్పదు. కొందరి అంచనా ప్రకారం బీఎస్ 3 వాహనాల అమ్మకాల్ని సుప్రీమ్ రద్దు చేయటంతో దాదాపు 20వేల కోట్ల నష్టం వస్తుందనీ! అయినా కూడా ఇది అందరూ కలిసి భరించాల్సిన ఆర్దిక భారం. లేదంటే… మనం భరించలేని ప్రకృతి నష్టం నెత్తిన పడుతుంది. ఇప్పటికే కాలుష్యం వల్ల మనిషి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాడు. కరువు నుంచీ క్యాన్సర్ వరకూ అన్నీ కాలుష్యం నుంచే పురుడు పొసుకుంటున్నాయి. కాబట్టి మనిషి వ్యాపారాన్ని మించి సామాజిక బాధ్యతతో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆఫ్ట్రాల్… ఏ వ్యాపారమైనా మనిషి అనేవాడు భూమ్మీద వుంటేనే కదా ముందు ముందు జరిగేది!