పవన్ కళ్యాణ్… పర్యటనల కళ్యాణ్ అయిపోతున్నాడా?

 

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓదార్చే బాధ్యత మీద పేటెంట్ ఎవరు తీసుకున్నారు? ఇంకెవరు… జగనే! వైఎస్ చనిపోయిన మరు క్షణం నుంచీ ఆయన ఎవర్ని పడితే వార్ని అవసరాన్ని బట్టీ, వీలుని బట్టీ ఓదారుస్తూ వస్తున్నారు! అయితే, ఆశ్చర్యకరంగా ఒక్కసారి తెలంగాణ ఏర్పడ్డాక జగన్ ఓదార్పు మొత్తం ఆంధ్రాకే పరిమితం అయిపోయింది! తెలంగాణలో వైసీపీకి పెద్దగా సీన్ లేదని తేలిపోవటంతో రాజకీయ ఓదార్పంతా పదమూడు జిల్లాల్లోనే పొంగిపోర్లించారు! అయితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్… పర్యటనల కళ్యాణ్ గా మారిపోయి ఓదార్చటంలో తానూ ఏం తీసిపోలేదని నిరూపిస్తున్నాడు!

 

పవర్ స్టార్ పవర్ ఫుల్ ఓదార్పు అందుకుని ఫుల్ హ్యాపీ అయిపోయిన తాజా బాధితులు ఎవరో తెలుసా? అగ్రిగోల్డ్ ఆర్తులు! అగ్రి గోల్డ్ వ్యవహారం బయటకు పొక్కి ఎప్పట్నుంచో రచ్చ నడుస్తోంటే… పవన్ హఠాత్తుగా ఇప్పుడు వార్ని ఆదుకోవాలని డిసైడ్ అయ్యాడు. వాళ్ల తరుఫున ప్రశ్నించటానికి గొంతు సవరించుకున్నాడు. విజయవాడలో వాళ్లని కలిసిన ఆయన ఓపిగ్గా చెప్పిందంతా విన్నాడు. కాటమరాయుడు రిలీజ్ అయిపోయి నెక్స్ట్ సినిమా సెట్స్ మీదకు వెళ్లని ఈ షార్ట్ గ్యాప్ లో… ఆయన అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నిలవటం నిజంగా ఆనందించాల్సిన విషయమే! కాని, రేపో మాపో కొత్త సినిమా స్టార్టై స్టూడియో గేట్ దాటి పవన్ బాబు బయటకి రాకపోతే అగ్రి గోల్డ్ ఆర్తుల పరిస్థితేంటి? అలాగని పవన్ షూటింగ్ మధ్యలో బయటకొచ్చేసి రోడ్లపై బైటాయించి ఉద్యమం చేస్తే మేకప్ కరిగిపోతుంది! దాని వల్ల కోట్లు విలువ చేసే సినిమాకి నష్టం!

 

ఒకవైపు రాజకీయం, మరో వైపు సినిమాల్లో నాటకీయం… రెండూ పవర్ స్టార్ బ్యాలెన్స్ చేస్తే అంతకన్నా కావాల్సింది మరేం లేదు. కాని, గత అనుభవాలు మరో రకం సినిమాని చూపిస్తున్నాయి! అప్పుడెప్పుడో అమరావతి నగరం కోసం పొలాలు ఇచ్చిన రైతుల్ని ఆయన కలుసుకున్నారు. వాళ్లు టిఫిన్ బాక్స్ లో తీసుకొచ్చిన అన్నం కూడా తిన్నారు! కాని, ఆ అన్నదాతల కోసం తరువాత ప్రత్యక్ష కార్యాచరణ ఆచరణలో పెట్టినట్టైతే ఎవరికి కనిపించలేదు. గవర్నమెంటే వారికి తగిన నష్టపరిహారం ఇచ్చేసింది కాబట్టి సరిపోయింది! ఇక రైతన్నల నుంచీ మొదలు పెడితే నేతన్నల వరకూ పవన్ పరామర్శించనీ వర్గం లేదు. పర్యటించని ప్రాంతం లేదు. ఇలా చేయటం తప్పు కాకపోయినా … ఊరికే అలా వెళ్లేసి ఓదార్పు అందించి వచ్చేయటానికి ఆల్రెడీ తెలుగు జనానికి ఒక యువనేత వున్నారు కదా… మళ్లీ మరో స్టార్ పొలిటీషన్ అవసరమా అంటున్నారు క్రిటిక్స్! మరి పవన్ తన ఈ వరుస పర్యటనలు, పరామర్శలు ముందు ముందు ఇలాగే కొనసాగిస్తాడా?లేక తనదైన స్టైల్లో వేరే ఏదైనా మార్గంలో జనంలో వుంటాడా? చూడాలి! ఇప్పటికైతే జనసేనాని జగన్ ను ఫాలో అయిపోతున్నట్టే కనిపిస్తోంది!