కాంగ్రెస్ ను ఏకేసిన వెంకయ్యనాయుడు



 ఏపీకి కేటాయించిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించారు. సీఎం చంద్రబాబు, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు, దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వాన్ని ఏకిపడేశారు. తమ పార్టీ ప్రయోజనాల కోసం యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించిందని.. ఏపీకి అన్యాయం చేసిందని మండిపడ్డారు. తెలంగాణా ఏర్పడాలి అలాగే ఏపీకి న్యాయం జరగాలి.. అన్ని సౌకర్యాలు ఇవ్వాలి అని పార్లమెంట్ లో ఎవరు గొంతు చించుకున్నారో అందరికి తెలుసని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో తనను అడ్డుకుంటామని కొందరు చెబుతున్నారని అడ్డుకుంటానంటే నాకు అభ్యంతరం లేదని, కానీ తాను వచ్చినప్పుడల్లా రాష్ట్రానికి ప్రాజెక్టు వస్తుందన్నారు. గడ్డిబొమ్మలు పెట్టి తన దిష్టి బొమ్మలు తలగబెట్టినంత మాత్రన అలాంటివి లెక్కచేయనని మండిపడ్డారు.

అంతేకాదు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కాంగ్రెస్ పార్టీ తెగ హడావుడి చేస్తుంది.. మరి యాభై ఏళ్లు పాలన చేసిన మీరు ఏం చేశారని ప్రశ్నించారు. తాను కష్టపడి ఇంతటి స్థాయికి వచ్చానని నలభై రాజకీయానుభవం ఉన్న నాకు మొదటి నుండి ఇదే పార్టీలో ఉన్నాను.. ఇదే పార్టీలో చస్తాను అని అన్నారు. అంతేకాని వారసత్వ రాజకీయాలతో రాలేదని కౌంటర్ ఇచ్చారు. ఎప్పుడు ఏ పార్టీలోకి మారతారో తెలియని వాళ్లు కూడా ఇప్పుడు తమను అడగడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.