కూర్చుంటేనే ముప్పా!

అవునండి కూర్చుంటే ముప్పే అంటున్నారు పరిశోధకులు. మారుతున్న జీవనశైలి,పనిచేసే పద్ధతి మనని కదలనీయకుండానే అదే పనిగా కూర్చొబెట్టేస్తున్నాయి. దీర్ఘకాలం కూర్చుని పనిచేసే ఉద్యోగస్తులకు గుండె జబ్బులే కాదు ఊబకాయంతో పాటు వెన్నుకి సంబందించిన సమస్యలు చుట్టుముడుతున్నాయని హెచ్చరిస్తున్నారు.

ఒకొక్కరు ఆఫీసుకి వెళ్ళిన దగ్గరనుంచి వచ్చేదాకా పని వల్ల ఆ ప్లేస్ నుంచి కదలలేకపోతారు. వారికి కావాల్సిన చిన్న చిన్న పనులకి కూడా ప్యూన్ ల మీద అధారపడుతూ ఉంటారు. నిజానికి అదే పనిగా ఎక్కువ సేపు కూర్చోవటం మన మన ఒంటికి సరికాదు అంటున్నారు మన వైధ్యులు. ఎందుకంటే కూర్చున్న సమయంలో మన శరీరంలోని లైపోప్రోటీన్ లైపేజ్(L P L )అనే ఎంజైమ్ యొక్క పనితీరు మందగిస్తుందిట. దాని వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను పీల్చుకుని కండరాలలోకి మార్చే ప్రక్రియకు అంతరాయం కలుగుతుందిట. దానితో రక్తం లోని కొవ్వు ప్రతి అవయవం దగ్గరా పెరిగిపోయి చివరకు అది గుండెపోటుకు మాత్రమే కాదు ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుందిట.

ఇలా కూర్చోవటం వల్ల ఇలాంటి సమస్యలన్నీ తెచ్చుకోవటం అవసరమా. అందుకే కొన్ని పద్ధతులు పాటించి వాటిని మన దగ్గరకి రాకుండా జాగ్రత్త పడదాం.


*  అదేపనిగా కూర్చోకుండా ప్రతి 20 నిమిషాలకి ఒకసారి లేచి నిలబడి అటు ఇటు  తిరిగితే మంచిది.

*  ఒత్తిడిగా అనిపిస్తే భుజాలకి విశ్రాంతి ఇచ్చేందుకు మధ్య మధ్యలో వాటిని పైకి కిందకి లేపుతూ ఉండాలి.  ఒక రెండు నిమిషాలు ఇలా చెయ్యటం వల్ల మెడ నొప్పికూడా  రాకుండా ఉంటుంది.

 

*  మనం  పనిచేసే సమయంలో మన మెదడుతో పాటు ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యేవి మన కళ్ళు. ఒక్క రెండు నిమిషాల వ్యవధి రాగానే కళ్ళకి చిన్నపాటి ఎక్సరసైజ్ చెయ్యటం మంచిది. దూరంగా ఉన్న వస్తువుని చూడటం, మొహం తిప్పకుండా కళ్ళని కుడి వైపు ఎడమ వైపు తిప్పటం ఇలాంటివి చెయ్యాలి. '

*  ఆఫీసు లో ఫోన్ మాట్లాడేటప్పుడు నుంచుని మాట్లాడటం అలవాటు చేసుకున్నా మంచిదే.

*  రోజులో కనీసం 40 నిమిషాలపాటు నడిస్తే కీళ్ళకు బాగా పనిచేస్తాయట.

*  మనం పనిచేసే ప్లేస్ లో కూర్చునే కుర్చీ,ఎ దురుగా ఉండే టేబుల్ సరైన హైట్ లో ఉన్నాయో లేదో గమనించుకుంటూ ఉండాలి. వాటిలో ఏ మాత్రం తేడ ఉన్న మీకన్నా ముందు మీ నడుముపై  ఆ ప్రభావం  

కనిపిస్తుంది.

 

*  ఆఫీసులో మిగిలిన వారితో పని ఉంటే ఫోన్లు వాడకుండా లేచి వెళ్లి వస్తూ ఉండటం కూడా మంచిది.

*  కాళ్ళు ఎక్కువసేపు కిందకి పెట్టి కూర్చోవటం వల్ల రక్తం మొత్తం కిందకి దిగి కాళ్ళు బరువెక్కి తిమ్మెరలు వస్తూ ఉంటాయి. దీనిని నివారించేందుకు కాళ్ళ కింద కాస్త ఎత్తుగా చిన్న స్టూల్ పెట్టుకోవటం మంచిది.


ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మరీ ఏదో ఒక పద్దతి మొదలుపెట్టేద్దామా.

...కళ్యాణి