ఏపీ రాజధాని కోసం సింగపూర్ అడ్వయిజర్
posted on Nov 17, 2014 4:08PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సింగపూర్ సహకారం తీసుకుంటున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ఒక అడ్వయిజర్‌ని నియమించింది. సింగపూర్‌లోని సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ (సీఎల్‌సి) డైరెక్టర్ అయిన ఖో టెంగ్ చెయీని నియమించింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన సందర్భంగా అక్కడి మంత్రి ఈశ్వరన్‌తో భేటీ తర్వాత ఏపీ రాజధాని నిర్మాణానికి సింగపూర్ సహకారం విషయంలో ఒక అవగహన కుదిరింది. ఇప్పుడు అడ్వయిజర్‌గా నియమితులైన ఖో టెంగ్ చంద్రబాబును సింగపూర్‌లోని సముద్రం ఒడ్డున నిర్మించిన పర్యాటక ప్రదేశం మరీనా బే శాండ్స్‌కి తీసుకెళ్ళారు. అక్కడ అద్భుతంగా ఉన్న ఆ పర్యాటక ప్రదేశాన్ని చూసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ తీరంలో కూడా ఇలాంటి పర్యాటక ప్రదేశాన్ని రూపొందించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గానీ, మరే ఇతర ప్రదేశాల ఏర్పాటు విషయంలో గానీ తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని ఖో టెంగ్ నుంచి హామీ వచ్చినట్టు తెలుస్తోంది.