అడుసు తొక్కనేల శంకరన్న...

 

మాజీ మంత్రి శంకరావు గ్రీన్ ఫీల్డ్ హౌసింగ్ సోసైయిటీ కేసులో నేరెడ్ మెట్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినప్పుడు, కాంగ్రెస్ పార్టీలో నేతలు ప్రళయం వచ్చినంత హడావుడి చేసారు. కానీ, అదే పార్టీకి చెందిన మోపిదేవి వెంకట రమణను జైల్లో చిరకాలంగా నిర్బందించినప్పటికీ, ఆ పార్టీలో స్పందించే నాదుడే లేడు.

 

శంకరావును అరెస్ట్ చేసి విడుదల కూడా చేసినప్పటికీ, కాంగ్రెస్ నేతలందరూ శంకరావు చేరిన ఆసుపత్రి ముందు క్యూలు కట్టి మరీ పరామర్శించి వచ్చారు. అందుకు కారణం వారు ఆయనపై జాలిపడుతున్నారనుకొంటే పొరబాటే అవుతుంది. ముఖ్యమంత్రిని వ్యతిరేఖించే నేతలే అనేకమంది శంకరవును పరామర్శించడం చూస్తే అసలు కధ తేటతెల్లమవుతుంది.

 

కిరణ్ కుమార్ రెడ్డిని వ్యతిరేఖిస్తున్న పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వంటివారు, అదునుకోసం చూస్తున్నప్పుడు శంకరావు అరెస్ట్ జరిగింది. వెంటనే అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని వారందరూ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తప్పుపడుతూ శంకరావుకు మద్దతుగా నిలిచారు. తత్ఫలితంగా కిరణ్ కుమార్ రెడ్డి సీఐడీ కమిటినీ కూడా వేయవలసి వచ్చింది.

 

అయితే, శంకరావు మాత్రం మాత్రం వాపును బలుపనుకొని, మరింత రెచ్చిపోయి సీఐడీ సహకరించకపోగా, తన కుమార్తె చేత ముఖ్యమంత్రి, డీజీపి, ఇతర పోలీసు అధికారులపై కేసులు వేయించడమే కాకుండా, ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి, ముఖ్యమంత్రికి వ్యతిరేఖంగా లేఖలు కూడా వ్రాయించారు.

 

గ్రీన్ ఫీల్డ్ భాగోతంలో అయన తప్పులు చేసినట్లు కోర్టులు నమ్ముతున్న తరుణంలో, తన తప్పులను సరిచేసుకొనడమో లేక నేరుగా ముఖ్యమంత్రి శరణు కోరడమో చేసే బదులు, మరిన్ని తప్పులు చేయడంతో ఆయన పరిస్థితి కోరుండి కొరివితో తల గోక్కున్నట్లు తయారయింది.

 

ఆయనను అరెస్ట్ చేసే సమయంలో తమను దూషించారంటూ నేరెడ్ మెట్ పోలీసులు చేసిన పిర్యాదుతో అయన మరోమారు అరెస్ట్ అయ్యే సూచనలు కనబడగానే మళ్ళీ కోర్టుకు పరుగులు తీసి ముందస్తు బెయిలు తీసుకోవలసి వచ్చింది. అది గాక, సీఐడీ పంపిన నోటీసులకు జవాబు చెప్పుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఇదంతా గమనిస్తే ‘అడుసు తొక్కనేల కాలు కడుగనేల’ అనే పెద్దలమాట మనకి గుర్తుకురాక మానదు.