నువ్వులని మించిన ఔషధం ఉందా!

నువ్వులు మనకి కొత్తేమీ కాదు. శ్రాద్ధ కర్మలలో నువ్వులను వాడటం చూస్తే, వేల సంవత్సరాల నుంచే భారతీయులు దీనిని పండిస్తూ ఉండేవారని అర్థమైపోతుంది. ఇప్పటికీ నువ్వుల పంటలో మన దేశానిది అగ్రస్థానమే!

 

- హైందవ ఆచారాలలో నువ్వులది సుస్థిరమైన స్థానం. నరక చతుర్దశి, సంక్రాంతి సమయాలలో చేసుకునే పిండివంటలలో నువ్వులు తప్పకుండా ఉండాలంటారు. నువ్వులలో పోషక పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని తినడం వల్ల శరీరంలో శరీరంలో తగినంత వేడి కలుగుతుందనే ఈ సూచన.

 

- కనీసం నెలకి రెండుసార్లయినా నువ్వుల నూనెతో తైలాభ్యంగనం చేయాలని చెబుతుంటారు. నువ్వుల నూనెని ఒంటికి పట్టించి, మర్దనా చేసి.... అది ఆరిన తరువాత స్నానం చేయడమే ఈ తైలాభ్యంగనం. మిగతా నూనెలతో పోల్చుకుంటే, నువ్వుల నూనె సాంద్రత చాలా ఎక్కువ. కాబట్టి ఒంటికి పట్టిన మట్టి, మకిలిని తొలగించి స్వేదరంథ్రాలను శుభ్రం చేయగలదు. ఇక నువ్వుల నూనెలో ఉండే విటమిన్ ఇ, కెలు అటు చర్మాన్నీ, ఇటు కేశాలనీ కూడా ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.

 

- మన దీపారాధనలో కూడా నువ్వులనూనెదే ప్రథమ ఎంపిక. ఎక్కువ కాంతిని ఇస్తాయనీ, ఎక్కువసేపు వెలుగుతాయనీ నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తారు. నువ్వుల నూనెతో వెలిగించిన దీపాలతో చుట్టుపక్కల వాతావరణంలో ఉన్న సూక్ష్మక్రిములు సైతం నశించిపోతాయట.

 

- నోటి పూత, నోరు పొడిబారిపోవడం వంటి సమస్యలు ఉన్నప్పుడు నువ్వుల నూనెను కాసేపు పుక్కిలించమని ఆయుర్వేదంలో చెబుతారు. ఇదే తరువాత కాలంలో ఆయిల్ పుల్లింగ్ అనే ప్రక్రియకు దారితీసింది.

 

- నువ్వులలో తగినంత జింక్, కాల్షియం ఉంటాయి. ఈ రెండు పోషకాలూ ఎముకలను దృఢంగా ఉంచుతాయని తెలిసిందే! ముఖ్యంగా పిల్లలలో సరైన ఎదుగుదల ఉండేందుకు నువ్వులు ఉపయోగపడతాయి. ఇక స్త్రీలు ఆస్టియోపొరోసిస్ వంటి ఎముకల సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు అప్పుడప్పుడూ నువ్వులు తీసుకోవాలని సూచిస్తున్నారు.

 

- నువ్వులలో అరుదైన Phytosterols అనే రసాయనం ఉంటుంది. దీని వలన రక్తంలోని కొవ్వు శాతం తగ్గుతుందనీ, రోగనిరోధక శక్తి పెరుగుతుందనీ, కొన్ని రకాల కేన్సర్లను సైతం అడ్డుకొంటుందనీ పరిశోధనల్లో రుజువైంది.

 

- నువ్వులలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఆహారం త్వరగా జీర్ణం అయ్యేందుకు, పేగులలో తగిన కదలికలు ఉండేందుకు ఈ పీచు పదార్థాలు ఉపయోగపడతాయి. తద్వారా జీర్ణసంబంధమైన వ్యాధులెన్నింటిలోనో నువ్వులు ఉపశమనాన్ని కలిగిస్తాయి.

 

- నువ్వులు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. పైగా గుండె ధమనులలో పేరుకుపోయే కొవ్వుని తొలగించడంలో కూడా గొప్ప ప్రభావం చూపుతాయి. నువ్వులలో ఉండే మెగ్నీషియం రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. ఈ కారణాలన్నింటి వల్లా గుండె ఆరోగ్యానికి నువ్వులు దివ్యౌషధం అని చెప్పవచ్చు.

 

ఇంతేకాదు! సహజసిద్ధమైన సన్స్క్రీన్లాగా, కాలి పగుళ్లకు నివారణగా, కంటిచూపుని మెరుగుపరిచేదిగా, ఒత్తిడిని తగ్గించే మందుగా, ఊపిరితిత్తుల సమస్యలకి ఔషధంగా, రక్తహీనతని ఎదుర్కొనే ఆయుధంగా... నువ్వులు అనేకరకాలుగా లాభిస్తాయి. ఇక ఆహారపదార్థాలకు రుచి అందించడంలో నువ్వుల పాత్ర గురించి చెప్పనే అక్కర్లేదు. అందుకే ఫాస్ట్ఫుడ్స్లో సైతం నువ్వులను విపరీతంగా వాడతారు.

మెక్సికోలో ఉత్పత్తి అయ్యే నువ్వులలో 75 శాతం నువ్వులను మెక్డొనాల్డ్స్ సంస్థ తన ఉత్పత్తుల కోసం ఖరీదు చేస్తుందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇంత ప్రశస్తమైనది కాబట్టే నువ్వుల నుంచి నూనె తీసిన తరువాత ఆ తెలకపిండిని కూడా మనవారు పశువులకు ఆహారంగా పెడుతూ ఉంటారు.

- నిర్జర.