‘రుద్రమదేవి’లో పొలిటికల్ టచ్

 

అనుష్క ప్రధాన పాత్రధారిగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రుద్రమదేవి’ సినిమా ట్రైలర్ సోమవారం నాడు విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్ అదరహో అన్నట్టుగా వుందన్న ప్రశంసలు వినిపిస్తున్నాయి. సినిమాలోని మేకింగ్ వాల్యూస్‌ని ఈ ట్రైలర్ అద్దం పట్టిందని చెబుతున్నారు. ‘రుద్రమదేవి’ షూటింగ్ ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇంత ఆలస్యమైందేంటా అన్న అభిప్రాయాలు జనాల్లో, సినిమా జనాల్లో వున్నాయి. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత అందరూ ఆలస్యమైతే అయిందిగానీ, కనువిందు చేసే సినిమా రాబోతోందని డిసైడ్ అయ్యారు. ఇదిలా వుంటే, ‘రుద్రమదేవి’ సినిమాలో వర్తమాన రాజకీయ పరిస్థితులకు అద్దంపట్టే డైలాగ్స్ కూడా వున్నాయి. సినిమా కథకు సెట్ అయ్యే విధంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు వర్తించే విధంగా రెండు డైలాగ్స్‌ ఈ ట్రైలర్‌లో వినిపించాయి. ఈ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రని ధరించిన అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్తాడు.. అది ‘‘నేను తెలుగుభాష లెక్క.. ఈడా వుంటా.. ఆడా వుంటా’’ అని. అంటే రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నది తెలుగేనని అర్థం ధ్వనిస్తోంది. అలాగే రుద్రమదేవి పాత్రధారిణి అనుష్క ‘‘ఒక తల్లి పాలు తాగి పెరిగినవాళ్ళు అన్నదమ్ములైనప్పుడు... ఒకే నది నీళ్ళు తాగి బతికినవాళ్ళు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు కాకుండా పోతారా’’ అని ప్రశ్నిస్తుంది. అంటే, కృష్ణ, గోదావరి నీళ్ళు తాగుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు భౌగోళికంగా విడిపోయినా అన్నదమ్ములు కాకుండా పోతారా అనే సందేశం ఈ డైలాగ్‌లో పరోక్షంగా వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ సినిమా అనేది వినోదం కోసం మాత్రమే కాదు.. సమాజానికి ప్రతిబింబంగా నిలిచేదనే అంశాన్ని తన ‘రుద్రమదేవి’ సినిమా ద్వారా మరోసారి నిరూపించబోతున్న దర్శకుడు గుణశేఖర్‌కి అభినందనలు.