ఆర్.ఎస్.ఎస్. కామెంట్లే కొంప ముంచాయా?
posted on Nov 8, 2015 3:02PM

బీజేపీ నాలుగు అడుగులు ముందుకు వేస్తే పది అడుగులు వెనక్కి లాగడానికి ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ సిద్ధంగా వుంటుంది. తాజాగా బీహార్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో బీజేపీ దారుణంగా చతికిలపడటానికి ఆర్.ఎస్.ఎస్. కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓవైపు బీహార్లో ప్రచారం జరుగుతుంటే, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఊరుకోకుండా భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ల విధానాన్ని పునః సమీక్షిస్తుందని కామెంట్ చేశారు. దాంతో ఆయన దొరికిపోవడమే కాకుండా బీజేపీ కూడా దొరికిపోయేట్టు చేశారు. ఈ కామెంట్‌ని అడ్డం పెట్టుకుని లాలూ ప్రసాద్ యాదవ్ రెచ్చిపోయారు. బీజేపీకి అధికారం ఇస్తే రిజర్వేషన్లు రద్దయిపోతాయని ప్రచారం మొదలుపెట్టారు. ఆ ప్రచారం బీహార్ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. జరిగిన నష్టాన్ని గ్రహించిన మోడీ రిజర్వేషన్లను తొలగించే సత్తా ఎవరికీ లేదని వివరణలు ఇచ్చుకున్నా ప్రయోజనం లేకపోయింది. బీజేపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయి కొంప మునిగింది.