ఈటల దెబ్బకు దిగొచ్చిన కేసీఆర్..

తెలంగాణ కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. లాక్‌డౌన్‌ను పొడిగించి.. క‌ర్ఫ్యూ స‌మ‌యంలో స‌డ‌లింపులు ఇచ్చారు. లాక్‌డౌన్‌తో పాటు మ‌రికొన్ని నిర్ణ‌యాలు కూడా తీసుకుంది. అందులో ఒక‌టి.. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న 4,46,169 రేషన్‌ కార్డులను వెంట‌నే మంజూరు చేయ‌డం.. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియ పూర్తి చేయడం.. రేషన్ డీలర్ల కమీషన్ సహా ఇతర సమస్యలు పరిష్కారానికి కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేయడం. ఇదీ విష‌యం. పైపైన చూస్తే ఇది మామూలు మేట‌ర్‌లానే అనిపిస్తుంది. కానీ, త‌ర‌చి చూస్తే.. రేష‌న్‌కార్డుల జారీ వెనుక‌.. మాజీ మంత్రి ఈట‌ల ఎఫెక్ట్ బాగా ప‌ని చేసిందనే చెప్పాలి. 

స‌డెన్‌గా ఎప్పుడూ లేనిదీ ఇప్పుడే కేబినెట్‌కు రేష‌న్‌కార్డుల విష‌యం ఎందుకు గుర్తొచ్చిందోనని ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఈట‌ల ఎఫెక్ట్ అలాంటిది మ‌రి. రేష‌న్‌కార్డుల జారీకి, ఈట‌ల‌కు ఏం సంబంధం అనుకుంటున్నారా. చాలా చాలా సంబంధం ఉంది మ‌రి. ప్ర‌జ‌లు రోడ్ల మీద‌కు వ‌చ్చి డిమాండ్ చేయ‌కున్నా.. ఉద్య‌మాలు జ‌ర‌గ‌కున్నా.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను ఎవ‌రూ ముట్ట‌డించ‌కున్నా.. మీడియాలో వార్త‌లు రాకున్నా.. ఎవ‌రూ అడ‌గ‌కుండానే.. కేసీఆర్ దాదాపు నాలుగున్న‌ర ల‌క్ష‌ల రేష‌న్ కార్డులను హ‌డావుడిగా ఎందుకు ఇస్తున్న‌ట్టు? ఎందుకంటే.. ఈట‌ల ఎఫెక్ట్. 

అవును. అంత‌గా ప‌దే ప‌దే ఈట‌ల ఎఫెక్ట్ అన‌డానికి బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంది. అదేంటంటే.. ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లొచ్చిన ఈట‌ల‌.. మీడియా స‌మావేశం పెట్టి ఎమ్మెల్యే ప‌ద‌వికి, పార్టీకి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ప‌నిలో ప‌నిగా కేసీఆర్‌పై దుమ్మెత్తి పోశారు. ముఖ్య‌మంత్రి ప‌ని తీరుపై అనేక ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తారు. అందులో ఒక‌టి.. ఈ రేష‌న్ కార్డుల అంశం. అవును.. రెండేళ్లుగా బియ్యం కార్డులు  ఎందుకు ఇవ్వ‌డం లేదంటూ ఆ ప్రెస్‌మీట్‌లో కేసీఆర్‌ను నిల‌దీశారు ఈట‌ల రాజేంద‌ర్‌. కుటుంబంలో స‌భ్యులు పెర‌గ‌డం లేదా? వారికి బియ్యం ఇవ్వ‌రా? రెండేళ్ల‌వుతున్నా.. ఒక్క రేష‌న్ కార్డు అయినా ఇచ్చారా? కొత్త రేష‌న్‌కార్డులు ఎందుకు ఇవ్వ‌రు కేసీఆర్ అంటూ ముఖ్య‌మంత్రిని గ‌ట్టిగానే ప్ర‌శ్నించారు ఈట‌ల రాజేంద‌ర్‌. ఎవ‌రికైనా డౌట్ ఉంటే.. నాలుగు రోజుల క్రితం జ‌రిగిన ఈట‌ల రాజేంద‌ర్ ప్రెస్‌మీట్ స్పీచ్‌ను మ‌రోసారి వినండి.. మీకే క్లారిటీ వ‌స్తుంది...

ఇలా రేష‌న్‌కార్డుల జారీ విష‌యంలో కేసీఆర్‌ను ఈట‌ల నిల‌దీయడంతో ముఖ్య‌మంత్రి ఉలిక్కిప‌డిన‌ట్టున్నారు. నిజ‌మే క‌దా.. రెండేళ్లుగా రాష్ట్రంలో కొత్త రేష‌న్‌కార్డులు ఇవ్వలేదగా అని ఇప్పుడు యాదికి వ‌చ్చిన‌ట్టుంది. వెంట‌నే అధికారుల‌ను పిలిపించుకుని లెక్క‌లు తెప్పించుకున్నార‌ట కేసీఆర్‌. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 4,46,169 రేషన్‌ కార్డు అప్లికేష‌న్లు పెండింగ్‌లో ఉన్నాయ‌ని ఆఫీస‌ర్లు చెప్పార‌ట‌. దీంతో.. వెంట‌నే పెండింగ్ బియ్యం కార్డుల‌ను 15 రోజుల్లోగా జారీ చేసేలా కేబినెట్ మీటింగ్‌లో నిర్ణ‌యం తీసుకుంది స‌ర్కారు. అప్పుడెప్పుడో రెండేళ్ల క్రితం వ‌చ్చిన అప్లికేష‌న్లే నాలుగున్న‌ర ల‌క్ష‌లుంటే.. మ‌రి ఈ రెండేళ్ల‌లో కొత్త కుటుంబాలు, కొత్త కుటుంబ స‌భ్యులు సైతం భారీగానే పుట్టుకొచ్చి ఉంటారుగా. ప‌నిలో ప‌నిగా.. పెండింగ్‌తో పాటు అర్హుల కోసం కొత్త రేష‌న్ కార్డులు కూడా ఇస్తే బాగుంటుంద‌ని ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్లుగా జ‌ర‌గ‌ని రేష‌న్‌కార్డుల జారీ ప్ర‌క్రియ‌.. ఈట‌ల నోటి నుంచి వ‌చ్చిన ఒక్క డైలాగ్‌తో.. నాలుగు రోజుల్లోనే దిగొచ్చారు సీఎం కేసీఆర్ అంటున్నారు. అదే విధంగా.. ఈట‌ల ప్ర‌శ్నించిన.. పెన్ష‌న్‌ల పని కూడా కాస్త చూడండి కేసీఆర్ సారూ అని కోరుతున్నారు జ‌నాలు. 

కేబినెట్ తీసుకున్న పెండింగ్ రేష‌న్‌కార్డుల జారీ నిర్ణ‌యం.. కేసీఆర్‌పై పోరాటం ప్రారంభించిన ఈట‌లకు తొలి విజ‌యంగా చెబుతున్నారు. రాజేంద‌ర్ ప్ర‌శ్న‌లు.. కేసీఆర్ ప్ర‌భుత్వంలో ప్ర‌కంప‌ణ‌లు సృష్టించాయ‌ని.. ఈట‌ల దెబ్బ‌కు ముఖ్య‌మంత్రి దిగొచ్చార‌ని రాజేంద‌ర్ అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu