నందమూరివారికి పార్టీని అప్పగించితేనే బెటర్!

 

‘తెలుగుదేశం పార్టీకి నందమూరి కుటుంబ సభ్యులు నాయకత్వం వహిస్తేనే మేలు!’ జరుగుతుందని ఒక పెద్దాయన అభిప్రాయ పడ్డారు. కాకపొతే ఆ మాటన్నది వయా ప్రజారాజ్యం-కాంగ్రెస్ పార్టీలో చేరి దేవాదాయశాఖ తీర్ధం పుచ్చుకొన్నసి.రామచంద్రయ్య కావడమే విశేషం.

 

ఇటీవల ఆయన వైజాగ్ వచ్చినప్పుడు మీడియావారితో మాట్లాడుతూ “చంద్రబాబు నాయుడు రోజుకొక కొత్త వాగ్దానం చేస్తూ ఎలాగయినా ప్రజలను మభ్యపెట్టి తిరిగి అధికారంలోనికి రావాలని పాపం ఆయన ఆశ పడుతున్నారు. అయితే, ఆయన కల కలగానే మిగిలిపోక తప్పదు. నిజంగా ఆయన తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని కోరుకొంటే, పార్టీ బాధ్యతలను నందమూరి కుటుంబ సభ్యులెవరికయినా అప్పగించి తానూ పార్టీ నుండి తప్పుకొంటే ఆ పార్టీకి గెలిచే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఆయన ఇప్పుడు చేస్తున్న వాగ్దానాలతో పాటు మరో ప్రకటన కూడా చేయడం మంచిది. అది ‘త్వరలో తెలుగు దేశం పార్టీ చచ్చిపోబోతోందని’ ప్రకటించడం. ఆయన నేతృత్వంలో ఆ పార్టీ అధికారంలోకి రాదని నేను ఖచ్చితంగా చెప్పగలను,” అని అన్నారు.

 

తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ, “అసలు ఆ పార్టీ నేతలు తమ పార్టీ అధికారం లోకి రాగలదని ఎలా విశ్వసిస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు. ఒకపక్క వారి అధినేత అక్రమాలకూ పాల్పడి జైల్లో ఉన్నపటికీ, ప్రజలు అవేమి పట్టించుకోకుండా ఆయన పార్టీకే ఓటేస్తారని ఎలా నమ్ముతున్నారు? ప్రజలకి ఆయన అక్రమార్జనల గురించి ఏమీ తెలియదని భావిస్తున్నారా లేక వాటిని పట్టించుకోరని భావిస్తున్నారా? వారే చెప్పాలి.”

 

“వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాదించడం ఖాయం అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల ప్రయోజనాలను కాపాడగలదు. దేశాన్ని ముందుకు నడిపించగల శక్తి గలది,” అని తెలిపారు.

 

రామచంద్రయ్య గారు ప్రస్తుతం కాంగ్రెస్ గొడుగు క్రింద సేద తీరుతున్నారు గనుక, కాంగ్రెస్ పార్టీకి ‘టముకు’ వేసుకొంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, ప్రతిపక్ష పార్టీ ఎవరిని అధినేతగా పెట్టుకొవాలో ఆయన చెప్పడం మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో తనకు తగిన గౌరవం లేదని నిత్యం వాపోయే ఆయన, ముందు తన సంగతి గురించి ఆలోచించక ప్రతిపక్ష నేతల గురించి,వారి పార్టీల గురించి ఆలోచించి ఎందుకు శ్రమ పడుతున్నారో ఆయనకే తెలియాలి.

 

ప్రజారాజ్యం పార్టీ గత ఎన్నికల సమయంలో దాదాపు కుప్పకూలిపోయే స్థితిలో ఉన్నపుడు ఆపార్టీకి చెందిన ప్రభాకర్, హరిరామ జోగయ్యవంటి అనేక మంది సీనియర్లు చిరంజీవికి తగిన సలహా ఇచ్చేందుకు ప్రయత్నించినప్పుడు, రామచంద్రయ్య గారు మాత్రం తన టికెట్టు, గెలుపు సంగతే చూసుకొన్నారు. తత్ఫలితంగా చిరంజీవికి మంచి చెప్పినవారు బయటకిపోవలసి వచ్చింది. రామచంద్రయ్యవంటివారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ గంగలో కలిపేందుకు మాత్రం చాలా శ్రమ పడినందుకు మంత్రి పదవులు పుచ్చుకోగలిగారు.

 

స్వంత పార్టీ అధినేతకు కనీసం మాట సహాయం కూడా చేయని ఆ పెద్దమనిషి ఇప్పుడు ప్రతిపక్షం గురించి అడగకుండా ఉచిత సలహాలు ఎందుకు ఇస్తున్నారు? ఒకవేళ, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కానీ, ఆయనకు టికెట్ ఈయకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకొని ఉంటారని హామీ ఈయగలారా?అని తెదేపా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లు అడగితే ఆయన ఏమి సమాధానం చెపుతారు?