చిక్కాల చిక్కడు ... దొరకడు.
posted on May 28, 2012 2:01PM
రామచంద్రాపురం అసెంబ్లీ సెగ్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచే అభ్యర్థుల పేర్లు తెరపై మారుతున్నాయి. ఈ నియోజకవర్గంలో జరుగుతున్నా ప్రయివేటు సర్వేల్లోనూ ఇదే తరహా ఫలితాలు వస్తున్నాయి. నిన్నటివరకూ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ కు అనుకూలంగా వాతావరణం ఉందని విశ్లేషకులు చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి తోట త్రిమూర్తులుకు అనుకూలమని చెబుతున్నారు. మధ్యలో కొంతకాలం తెలుగుదేశంపార్టీ అభ్యర్థి చిక్కాల రామచంద్రారావు నెగ్గేస్తారని పందేలు కట్టారు.
ఆయన ఏమీ సంపాదించుకోలేని అన్నాహజారే వంటి వాడంటూ చంద్రబాబు కితాబు ఇచ్చారు. దీంతో కొన్నాళ్ళపాటు ఆయన గాంధీ టోపీ పెట్టుకుతిరిగారు. అయితే నియోజకవర్గ ఓటరు మాత్రం చిక్కాలపై కొంత అసహనంతోనే ఉన్నారు. ఆయన ఎవరికీ చిక్కడు ... దొరకడని ఆయన ఎవరికీ ఏ సహాయం చేసి ఎరగడని ఓటర్లు వాపోతున్నారు. వయస్సు రీత్యా కానీ, పని రీత్యాకానీ చిక్కాలకు అన్నాహజారేతో పోలికే లేదని అలా పోల్చి అన్నాహజారే ప్రతిష్ఠ దెబ్బ తీశారని హజారే అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చిక్కాల కొంచెం వెనక్కి తగ్గారు. అలానే ఆయనపై నమ్మకమున్న ఓటర్ల సంఖ్య కూడా తగ్గుతోంది. ఇంకో వారం రోజుల పాటు ప్రచారం పూర్తయితే కానీ ఖచ్చితంగా గెలిచే అభ్యర్థి ఎవరో తేల్చలేమని విశ్లేషకులు తేల్చేస్తుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి 20మంది అభ్యర్థులు 31నామినేషన్లు దాఖలు చేశారు.