మోదీ నిద్రలేని రాత్రులు గడుపుతారు.. నాదీ గ్యారెంటీ

 

రాఫెల్‌ ఒప్పందంపై తాజాగా ఓ మీడియా సంస్థ పరిశోధనలు చేసి నివేదిక రూపొందించింది. ఈ నివేదికను ఆధారంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోదీని కాపాడేందుకు డసో ఏవియేషన్ సీఈవో అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. 'అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ డిఫెన్స్‌కు భూమి ఉంది, హాల్‌కు లేదని కాంట్రాక్టు ఇవ్వలేదని డసో సీఈవో చెప్పారు. అయితే రిలయన్స్‌ డిఫెన్స్‌ వద్ద ఉన్న భూమిని డసో ఇచ్చిన డబ్బులతోనే కొనుగోలు చేశారు. అనిల్‌ అంబానీ కంపెనీలో డసో ఏవియేషన్‌ రూ.284కోట్ల పెట్టుబడులు పెట్టింది. తర్వాత ఆ డబ్బుతోనే ఆ సంస్థ భూమిని కొనుగోలు చేసింది. నష్టాల్లో ఉన్న ఓ కంపెనీలో డసో పెట్టుబడులు ఎందుకు పెట్టింది?. దీన్ని బట్టి చూస్తుంటే డసో సీఈవో అబద్ధం చెబుతున్నారు. ప్రధాని మోదీని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే రాఫెల్‌ ఒప్పందంపై దర్యాప్తు జరిగితే మోదీ తప్పించుకోలేరు. ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతారు. అందుకు నాదీ గ్యారెంటీ' అని అన్నారు. డసో ఒప్పందంపై రక్షణశాఖకు సమాచారం ఇవ్వకుండానే మోదీ ఒక్కరే నిర్ణయం తీసుకున్నారు. అనిల్‌ అంబానీ కోసమే ఆయన ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు’ అని రాహుల్‌ ఆరోపించారు.