ఒక సింధు... ఎందరో పూజలు!

 

మన దేశంలో చల్లటి హిమాలయాలు వుంటాయి. భగభగలాడిపోయే తార్ ఎడారి కూడా వుంటుంది. సంవత్సరం మొత్తం వర్షంలో తడిసే ప్రాంతాలుంటాయి. సంవత్సరాల పాటూ నీటి చుక్క కురవని కరువు ప్రాంతాలు కూడా వుంటాయి. ఇండియా అంటేనే అంతా... క్రీడల విషయంలో కూడా భారతదేశంలో ఎటు చూసినా అంతే కనిపిస్తుంది. ఒకవైపు సింధు లాంటి ఒలంపిక్ విన్నర్స్ కి మన ప్రభుత్వాలు కోట్లు గుమ్మరిస్తాయి. అది తప్పు కూడా కాదు. ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత, విజయాల్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా వుంది. కాని,అసలు సమస్య నాణానికి మరో వైపు వుంటుంది...

 

సింధు, సానియా, సైనా, మేరీ కామ్... వీళ్లే మనకు తెలుసు. తెలియకుండా మిగిలిపోతోన్న అనేక మంది క్రీడాకారులు దేశంలో అడుగడుగునా వున్నారు. వాళ్ల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు మన పాలకులు. కనీస అవసరాలు కూడా ఏర్పాటు చేయకుండా అమానుషంగా చిదిమేస్తున్నారు ఎందరో క్రీడా సుమాల్ని.

 

రియోలో సిల్వర్ సాధించిన సింధు ఇంకా ఇంటికి కూడా రాలేదు. కాని, అప్పుడే పంజాబ్ లోని పటియాలాలో ఒక పూజ అర్ధాంతరంగా జీవితం చాలించింది. కారణం... వివిధ దశల్లో పాలకుల నిర్లక్ష్యం. ఆమె జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ క్రీడాకారిణి కావటంతో పటియాలాలోని ఖల్సా కళాశాలలో సీట్ వచ్చింది. మొదటి సంవత్సరం పూజా హాస్టల్ లో వుంటూ హాయిగానే చదువుకుంది. కాని, రెండో సంవత్సారనికి ఆమెని మన దేశంలోని దారుణమైన వ్యవస్థ కాటేసింది. ప్రధాని మోదీని ఉద్దేశించి ఆమె రాసిన సూసైడ్ నోట్ ప్రకారం... కోచ్ వల్ల ఆమె రెండో యేడు హాస్టల్ లో వుండే అర్హత పొందలేకపోయింది. ఫలితంగా కఠిన పేదరికంతో బాధపడే ఆ అమ్మాయి ప్రతీ రోజూ డబ్బులు పెట్టుకుని ఇంటి నుంచి కాలేజ్ కి వచ్చిపోవాల్సి వచ్చింది. చివరకు, ఆర్దిక భారం భరించలేక, తాను ఇష్టపడ్డ ఆటలో ముందుకు పోలేక, పోతాననే విశ్వాసమూ లేక ప్రాణాలు తీసుకుంది...

 

పంజాబ్ లోని పటియాలాలో ఒక పూజ కాదు. మన దేశంలో ప్రతీ రాష్ట్రంలో ఎందరో పూజలు వున్నారు. అందరూ ఆత్మహత్యలు చేసుకోకపోవచ్చు. కాని, ప్రభుత్వం నుంచి సరైన ప్రొత్సాహం, సరైన సమయంలో దక్కక ఆటకి ఆటవిడుపు ప్రకటించి సామాన్య జనాల్లో కలిసిపోతున్నారు. అంటే... మనుషులుగా కాకపోయినా క్రీడాకారులుగా ఆత్మహత్య చేసుకుంటున్నారన్నమాట! ఇందుకు స్పష్టమైన కారణం ఒలంపిక్ మెడల్ విజేతలకు, క్రికెట్ ప్లేయర్లకు సాగిలబడి దండలు పెట్టే ప్రభుత్వాలే. విజయం సాధించిన వార్ని తప్ప సాధించే సత్తా వున్న వార్ని ఇక్కడెవ్వరూ పట్టించుకోరు! అదే విషాదం!

 

ఆల్రెడీ ఎదిగి మహా వృక్షమైన చెట్టుకి ఎన్ని నీళ్లు పోసినా కొత్తగా ఒదిగేదేం వుండదు. అప్పుడప్పుడే ఎదుగుతున్న మొక్కకి, మొక్కవోని దీక్షతో సాధన చేస్తున్న ఔత్సాహికులకి... ప్రొత్సాహమనే నీరందిస్తేనే ప్రభుత్వాలు, పాలకుల బాధ్యత నెరవేరేది! దేశం దూసుకుపోయేది...