అర్ధరాత్రి అరెస్ట్.. రేవంత్ రెడ్డి ఎక్కడ?

 

తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ కొడంగల్‌ నియోజవర్గంలోని కోస్గిలో ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిరసన ర్యాలీ నిర్వహించి సభని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. దీనిపై తెరాస నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. రేవంత్‌ ప్రజల్ని రెచ్చగొడుతున్నారని, కొడంగల్‌ బంద్‌కు పిలుపునిచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈసీ ఆదేశాలతో ఐపీసీ సెక్షన్లు 341, 188, 506, 511 కింద కొడంగల్‌ పోలీసు స్టేషన్‌లో రేవంత్‌పై కేసు నమోదు చేశారు. బహిరంగ సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు రేవంత్‌రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. మంగళవారం వేకువ జామున మూడు గంటల సమయంలో రేవంత్‌రెడ్డి నివాసంలోకి బలవంతంగా ప్రవేశించిన పోలీసులు గేటు తాళాలు పగులగట్టి అతన్ని అదుపులోకి తీసుకొన్నారు. రేవంత్‌రెడ్డితో పాటు అతని సోదరులు, వాచ్‌మెన్‌, గన్‌మెన్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పరిగి వద్ద వాచ్‌మెన్‌ను వదిలివెళ్లారు. 


పోలీసుల తీరుపై రేవంత్‌రెడ్డి భార్య గీత అసంతృప్తి వ్యక్తం చేశారు. తన భర్తను బలవంతంగా తీసుకెళ్లారని, తమ ఆత్మ గౌరవం మీద దెబ్బకొడితే ఊరుకునేది లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని, ఓటుతో బుద్ధి చెప్పాలని గీత కోరారు. రేవంత్‌ రెడ్డి ని అరెస్ట్ చేసిన పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారు అనే విషయం కూడా తెలపడం లేదని గీత ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఆయన్ను జడ్చర్లకు తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జడ్చర్లలోని పోలీస్ శిక్షణా కేంద్రంలో రేవంత్‌ రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కొడంగల్‌ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో 144 సెక్షన్‌ అమలవుతోంది. మరోవైపు బొంరాస్‌పేట మండలంలోనూ పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.