పోకెమాన్‌గోతో ఆరోగ్యం!

 

కబాలి హడావుడి ముగిసింది. కానీ పోకేమాన్‌ మాత్రం దూసుకునిపోతున్నాడు. ప్రపంచానికంతా ఇప్పుడు పోకెమాన్‌ జాడ్యమే పట్టేసింది. ఇలాంటి ఆటలు ఆడుతూ, లేని జంతువులను ఊహించుకుంటూ రోడ్ల మీద తిరగడం వల్ల రకరకాల సమస్యలు వస్తాయన్న వార్తలు పుంఖానుపుంఖాలుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇన్ని విమర్శల మధ్య కొన్ని సానుకూలమైన మాటలు కూడా వినిపిస్తున్నాయో. అవేంటంటే...

 

విటమిన్‌ డి లభ్యం- పొద్దస్తమానం, అయితే ఇంట్లోనూ లేకపోతే కారులోనూ గడిపేసే పాశ్చత్యులని ఆరుబయలకు తీసుకువచ్చిన ఘనత పోకెమాన్‌దే. ఇందులో ఎలాంటి అనుమానమూ లేదు! ఇలా రోజూ కాసేపు ఎండపట్టున తిరగడం వల్ల ఇంతవరకూ దూరంగా ఉన్న విటమిన్‌ డి ఇప్పుడు పుష్కలంగా లభిస్తోందంటున్నారు పోకెమాన్‌ ప్రియులు. కీళ్ల నొప్పుల నుంచి చర్మవ్యాధుల వరకూ విటమిన్‌ డి ఎంత అవసరమో చెప్పేదేముంది. జీవనశైలిలో మార్పు- ఆధునిక జీవనశైలి అంటే, నిరంతరం ఏదో ఒక చోట కూర్చుని ఉండటమే! దానికి తోడు ఇప్పటి వరకూ ప్రచారంలో ఉన్న వీడియో గేమ్స్ అన్నీ కూడా కూర్చుని అడేవే. పోకెమాన్‌తో ఇలాంటి పరిస్థితి నుంచి మార్పు వచ్చిందంటున్నారు. పోకెమాన్‌తో ఇంతవరకూ కుర్చీలోంచి కదలని వారంతా లేచి నాలుగు అడుగులు వేస్తున్నారట.

 

 

వేగం.. వేగం-  పోకెమాన్‌గోని పట్టుకోవాలంటే అలా ఓ నాలుగడుగులు వేస్తే సరిపోదు. కాస్త వేగంగా నడవాలి. కాస్త చురుగ్గా పోకెమాన్ల కోసం వెతకాలి. దీని వల్ల కావల్సినంత వ్యాయామం అవుతోందంటున్నారు కొందరు. ఈ ఆట ఆడుతున్న దగ్గర్నుంచీ రోజుకి కనీసం గంట తక్కువ కాకుండా నడుస్తున్నాం అనేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. పని ఒత్తిడి నుంచి విశ్రాంతి- ఈ రోజుల్లో ఉద్యోగాలు ఎంత ఒత్తిడితో కూడుకుని ఉంటాయో చెప్పేదేముంది! రోజుకి పది పన్నెండు గంటలు పనిచేసినా కూడా ఇంకా మెదడు మీద ఆ ఉద్యోగభారం ఉంటూనే ఉంటుంది. పోకెమాన్‌గోతో అలాంటి ఒత్తిడి నుంచి సులువుగా దూరం కావచ్చునంటున్నారు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు సిగిరెట్టు, మద్యపానాల జోలికి పోకుండా, పోకెమాన్‌తో ఆడుకోవడం మంచిదే కదా అని దబాయిస్తున్నారు.

 

డోపమైన్‌:  పోకెమాన్‌గో ఆడుతున్నప్పుడు శరీరంలో డోపమైన్‌ అనే రసాయనం విడుదల అవుతుందనీ, ఇది ఒకరకమైన సంతృప్తిని కలిగిస్తుందనీ చెబుతున్నారు. నిరంతరం ఈ సంతృప్తిని కోరుకోవడం కోసమే పోకెమాన్‌గో అంటే పడి చస్తున్నారు జనం.

 

సరే! పోకెమాన్‌గోతో ఇలాంటి ఉపయోగాలు కొన్ని ఉంటే ఉండవచ్చుగాక! కానీ ఎక్కడ నడుస్తున్నామో చూసుకోకుండా, ఏ హద్దులు దాటుతున్నామో గమనించుకోకుండా... గంటల తరబడి జీవితాలను వెచ్చించే ఈ పోకెమాన్‌గో ఏ వ్యసనానికీ తీసిపోదంటున్నారు పెద్దలు. ఇలా ఎవరి వాదనని వారు వినిపించేశారు. ఇక నిర్ణయించుకోవల్సింది మనమే!

 

- నిర్జర.