పర్వేజ్ ముషార్రఫ్‌... నవ్విపోదురుగాక!

నిన్న ఒక భారతీయ వార్తా ఛానల్‌ ముందు పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌ సాగించిన ప్రగల్భాలు అన్నీ ఇన్నీ కావు. ఒకపక్క పాకిస్తాన్‌ గూఢచర్య సంస్థ ISI తీవ్రవాదులకి శిక్షణ ఇస్తోందని నిర్భయంగా ఒప్పుకుంటూనే, పాకిస్తాన్‌లో అశాంతికి కారణం ఇండియానే అంటూ విరుచుకుపడ్డారు. ‘మొగుణ్ని కొట్టి మొగసాలకెక్కినట్టు’ కశ్మీర్ తీవ్రవాదానికి మద్దతు పలుకుతూనే, భారతదేశాన్ని ఆడిపోసుకున్నారు. పర్వేజ్ ముషార్రఫ్‌ ప్రకారం 'కశ్మీర్‌లో జరుగుతున్న భారత అకృత్యాలను ఎదుర్కొనేందుకు ఆ దేశ రక్షణ సంస్థలు జైష్‌-ఎ-మహమ్మద్, లష్కర్‌-ఏ-తయ్యబా వంటి తీవ్రవాద సంస్థలకి కావల్సిన సహకారాన్నంతా అందించాయి'. అంతేకాదు! ముషార్రఫ్ దృష్టిలో కశ్మీర్‌లో ఉన్న వేర్పాటువాదులంతా గొప్ప నాయకులు. వారు ముంబైలో దాడులు సాగించినా, వందల మంది అమాయకుల ప్రాణాలను పొట్టనపెట్టుకున్నా... భారత్‌ ఆ విషయాలను పెద్ద మనసుతో మర్చిపోవాలి. ‘పదే పదే మీరు ఇలాంటి సంఘటల గురించి మాట్లాడుతూ, శాంతి చర్చలకు దూరంగా ఎందుకు ఉంటారు’ అంటూ చిరాకుపడిపోయారు ముషార్రఫ్‌. అయితే తీవ్రవాదం గురించి ముషార్రఫ్‌కి ఓ లెక్కుంది. కశ్మీర్‌లోనో, భారతదేశంలోని ఇతర ప్రాంతాలలోనో తీవ్రవాదులు దాడులకు తెగబడితే వారు హీరోలు. అదే తీవ్రవాదులు పాకిస్తాన్‌లో దాడులకు తెగబడితే వాళ్లు విలన్లు.

ముషార్రఫ్ జిత్తులమారితనం ప్రపంచానికి కొత్తేమీ కాదు. కార్గిల్ పేరిట మన దేశాన్ని దొంగదెబ్బను తీయడానికి పన్నిన వ్యూహం ముషార్రఫ్ మెదడులోదే. ఆ వ్యూహం కాస్తా బెడిసి కొట్టడంతో తన పదవిని నిలుపుకునేందుకు, అప్పటి పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ను గద్దె దించి తాను కాస్తా ఆ దేశ అధ్యక్షునిగా అధికారం చెలాయించాడు. ఆ సమయంలో ముషార్రఫ్ తన దేశంలోని నిరసన గళాలను నిలువరించేందుకు సాగించిన దాష్టీకం అంతా ఇంతా కాదు. తన పదవిని కాపాడుకునేందుకూ, ఇష్టారాజ్యంగా అధికారాన్ని చెలాయించేందుకు పాకిస్తాన్‌ రాజ్యాంగాన్ని సైతం ఇష్టం వచ్చినట్లు మార్చిపారేశాడు. 2007నాటికి దేశ ప్రజల్లో తన పట్ల వ్యతిరేకత పెరిగిపోతోందని గ్రహించిన పర్వేజ్‌, దేశ రాజ్యాంగాన్నే రద్దు చేసి ఎమర్జెన్సీని విధించాడు. కానీ ఎట్టకేళకి ప్రజాందోళనకి తల ఒగ్గి గద్దె దిగక తప్పలేదు. అయినా ముషార్రఫ్‌లోని పదవీకాంక్ష చల్లారలేదు. ప్రజల్లో తన పట్ల వ్యతిరేకత పెంచిందన్న కక్షతో, అప్పటి ప్రతిపక్ష నేత బేనజీర్‌ భుట్టో మీద దాడి చేయించి ఆమె చావుకి కారణమయ్యాడు. ప్రస్తుతం ఆమె హత్య కేసులో ఇంకా పాకిస్తాన్‌ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు భారతదేశానికి శాంతివచనాలు చెబుతున్నాడు- నవ్విపోదురుగాక!