ఆర్టికల్ 370 రద్దు.. రాజ్యాంగ ప్రతులను చించేసిన ఎంపీలు!
posted on Aug 5, 2019 1:20PM

కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 370 రద్దు గురించి హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రతిపాదిస్తున్న సమయంలో కాంగ్రెస్, పీడీపీ సహా పలు విపక్ష పార్టీల నేతలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. పీడీపీ సభ్యులు రాజ్యాంగ ప్రతులను చించివేయడంతో పాటు చొక్కాలు చించుకుని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా పీడీపీ ఎంపీలు తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపారు. మొదట కశ్మీర్‌లోని పరిస్థితులకు నిరసన తెలుపుతూ నల్ల బ్యాడ్జీలు కట్టుకుని పార్లమెంట్‌కు హాజరయ్యారు. సభలో బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత ఎంపీలు నజీర్ అహ్మద్ లావే, మీర్ మహమ్మద్ ఫయాజ్ రాజ్యాంగ ప్రతులను చించివేశారు. అనంతరం కేంద్రం తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చొక్కాలు చింపుకున్నారు. వారి ప్రవర్తనపై మండిపడ్డ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు.. పీడీపీ సభ్యులను సభ నుంచి బయటకి పంపాలని మార్షల్స్‌ను ఆదేశించారు. ఇదే సమయంలో ఆర్టికల్ 370 రద్దును నిరసిస్తూ ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి.