డిల్లీలో బొత్స బాబు హడావుడి

 

పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రోడ్డు మ్యాపులు పట్టుకొని డిల్లీలో హడావుడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రానికి చెందిన పనబాక, పురందేశ్వరి, శీలం, కావూరి, పల్లం, కోట్ల తదితర కేంద్ర మంత్రులందరూ కూడా సమైక్యవాదులే అయినప్పటికీ, రాష్ట్ర విభజనపై అధిష్టానం నిర్ణయానికి వారందరూ ఎప్పుడో కట్టుబడిపోయారు గనుక ఇక వారితో సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయాల వద్దా? అని చర్చించే పనిలేదు. అందువల్ల, బొత్స బాబు వారినందరినీ కలుస్తూ వారి సలహా సంప్రదింపులు తీసుకొని తన రోడ్డు మ్యాపుకు ఫైనల్ టచ్ అప్స్ ఇస్తున్నట్లు భావించవచ్చును.

 

 

సంక్లిష్టమయిన రాష్ట్ర విభజన ప్రక్రియలో రోడ్డు మ్యాప్ గీసిచ్చే భాగ్యం ఆయనకి దక్కడం గొప్ప విషయమే అయినప్పటికీ, వోక్స్ వ్యాగన్ కార్ల కంపెనీని వైజాగ్ కి రప్పించే ప్రయత్నంలో ఎవరినీ సంప్రదించకుండా తమ్ముడ్ని వెంటేసుకొని విమానం ఎక్కి జర్మనీ వెళ్లి ముక్కు మొహం తెలియని వాడిచేతిలో రూ.11కోట్ల పెట్టి వచ్చి, ఆనక ‘సొమ్ములు పోనాయి నానేటి సేసేది?’అని అడిగినట్లు, తన మ్యాపులో గీతలు వంకరపోయి దానివల్ల సీమాంధ్ర ప్రాంతానికి ఏదయినా నష్టం జరిగితే ఆనక జనాలకి జవాబు చెప్పుకోవడం అంత వీజీ కాదని అర్ధమయినందువల్లనేమో, ఎందుకయినా మంచిదని ఆయన డిల్లీలో కనబడిన ప్రతీ తెలుగు మంత్రిని కలిసి తన మ్యాపుని చూపించి వారిచేత ఒకే చేయించుకొంటున్నారు. అందువల్ల రేపు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎటువంటి సమస్య తలెత్తినా ఎవరూ తనను తప్పు పట్టకుండా ఉండాలని కొంచెం ముందు చూపుతో ఆయన వ్యవహరిస్తున్నట్లుంది. అది కూడా ఒకందుకు మంచిదేనని చెప్పవచ్చును. ఆయనొక్కడూ ఏదో తనకు తోచిన గీతలు గీసుకొని వెళ్లి అధిష్టానం చేతిలో పెట్టి చక్కారావడం కంటే అన్ని ప్రాంతాల నేతలను కలిసి రాష్ట్ర విభజన సమయంలో వారివారి ప్రాంతాలలో తలెత్తే సమస్యలను ముందుగానే గుర్తించగలిగితే విభజన జరిపే ముందుగానే వాటికి సరయిన పరిష్కార మార్గాలు కనుకొనే అవకాశం ఉంటుంది. మరి బొత్స బాబు ప్రస్తుతం అదే పని మీద ఉండి ఉంటే ఆయనని మెచ్చుకోక తప్పదు.