వింత నమ్మకంతో ఉన్న ఆ నియోజక వర్గం...
posted on Oct 5, 2019 11:33AM

ఏపీలో ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఆ నియోజక వర్గం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అనంతపురం జిల్లా ఉరవకొండ ఇపుడు పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది. దీనికి కారణం పయ్యావుల కేశవ్, వైసిపి నేత విశ్వేశ్వరరెడ్డి మధ్య సాగుతున్న ఆధిపత్య పూరి. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి లేని విధంగా ఇక్కడ ఒక స్పెషల్ ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రాదు. ఎమెల్యే ఒక పార్టీ నేత ఉంటే రాష్ట్రంలో అధికారంలో మరో పార్టీ ఉంటుంది. దీంతో ఎక్కడ ఎవరు ఎమ్మెల్యేగా ఉన్న ఓడిపోయిన అభ్యర్థుల నుంచి ఐదేళ్ల పాటు ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంటుంది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి పయ్యావుల కేశవ్ వర్సెస్ విశ్వేశ్వరరెడ్డి మధ్య పోరు కొనసాగుతోంది. తాజాగా ఒక పంచాయతీ విభజన అంశం ఇద్దరి మధ్య వార్ కు తెరలేపింది. నియోజకవర్గంలో పెద్ద కౌకుంట్ల పంచాయితీ చాలా పెద్ద గ్రామ పంచాయితీ పెద్ద కౌకుంట్ల పరిధిలో ఐదు గ్రామాలున్నాయి. అయితే పరిపాలన సౌలభ్యం కోసం రెండు పంచాయతీలుగా విభజించాలని అధికారులనుకుంటున్నారు.
ఇందు కోసం గ్రామ సభ నిర్వహించాలని అధికారులు భావించారు. అయితే ఇదే పెద్ద వివాదానికి కారణమైంది. పెద్ద కౌకుంట్ల పంచాయితీ టిడిపికి చాలా బలమైన పంచాయితీ. కేశవ్ గెలుపులో ఈ పంచాయితీ చాలా కీలక పాత్ర పోషించింది. ఈ పంచాయితీలో ఇచ్చిన తీర్పే ఇక్కడ ఎమ్మెల్యేని డిసైడ్ చేసింది. అందుకే ఈ పంచాయితీని విడదీయడం వల్ల గ్రామాల్లో పరిస్థితులు మారుతాయన్న భావనలో టిడిపి నేతలు ఉన్నారు. అదే సందర్భంలో ఈ పంచాయితీని విభజించి తీరాల్సిందేనని విశ్వేశ్వరరెడ్డి పట్టుబడుతున్నారు. ఇన్ని రోజులు పయ్యావుల కేశవ్ చర్యల వల్లనే ఇది జరగలేదని ఇపుడు దీనిని కూడా అడ్డుపెట్టుకోవడం సరైన చర్య కాదని ఆయన మండిపడుతున్నారు.
దీంతో సోమవారం జరిగిన గ్రామ సభలో హైటెన్షన్ వాతావరణం కొనసాగింది. మూడు రోజుల క్రితం హెచ్చెల్సీ నీరు విడుదల చేయాలంటూ పయ్యావుల కేశవ్ కాలువ గట్ల మీదకు వెళ్లటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. డీఎస్పీతో పాటు భారీగా పోలీసు బలగాలు వెళ్లి కేశవుని అడ్డుకున్నారు. గ్రామాలకు నీరు విడుదల చేయకపోతే పది వేల మందితో వచ్చి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు తాజాగా పెద్ద కౌకుంట్ల పంచాయితీ విభజన అంశం రాజకీయ రగడకు దారి తీస్తుంది. వీరిరువురి పోరులో ఎవరు నెగ్గుతారో ఎవరు తగ్గుతారో తెలుసుకోవాల్సిన అంశంగా మారింది.