పవన్, కిరణ్ ఇద్దరు త్యాగ మూర్తులు

 

పవన్ కళ్యాణ్, కిరణ్ కుమార్ రెడ్డిల జనసేన, జై సమైక్యాంధ్ర పార్టీల మధ్య కొన్ని సారూప్యతలు, తేడాలు ఉన్నాయి. ఇద్దరూ ఎన్నికల ముందే పార్టీలు స్థాపించారు. ఇద్దరూ రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తునందునే పార్టీలను స్థాపించారు. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేఖిస్తున్నారు. ఇద్దరూ ఈ ఎన్నికలలో పోటీ చేయడం లేదు. కిరణ్ సమైక్యం కోసమే ఎన్నికలలో పోటీ చేయకుండా త్యాగం చేశానని చెపుతుంటే, పవన్ దేశ సమగ్రతని కాపాడటం కోసం ఇంకా అనేక చిన్న చితకా కారణాలతో ఎన్నికలని త్యాగం చేసారు. కిరణ్ నేటికీ సమైక్యరాగం తీస్తుంటే, పవన్ మోడీజంలో ఉన్న మజా వేరెందులో లేదని బల్లగుద్ది చెపుతున్నారు. కిరణ్ ఎక్కడా కనబడని స్వంత పార్టీకి డప్పుకొట్టుకొంటుంటే, పవన్ మాత్రం బీజేపీకి డప్పు కొడుతున్నారు.

 

ఇక పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీకి రెండో సభతోనే మంగళ హారతి పలికేయగా, కిరణ్ మాత్రం ఎవరు వెంట వచ్చినా రాకున్నా, ఎవరు ఆదరించినా లేకున్నా ఒంటరిగా పార్టీని నెట్టుకుపోతూనే ఉన్నారు. పైగా ఆంధ్ర, తెలంగాణా రెండు ప్రాంతాలలో కూడా తన అభ్యర్ధులను నిలబెట్టారు. కానీ, పొట్లూరి వరప్రసాద్ కాళ్ళావెళ్ళా పడినా పవన్ కళ్యాణ్ కనీసం ఆయనను కూడా పోటీలో నిలబెట్టలేదు. పవన్ కళ్యాణ్ తెదేపా, బీజేపీలకు మద్దతు ప్రకటించినప్పటికీ ఆయన ఇంతవరకు కేవలం బీజేపీకి మాత్రమే ప్రచారం చేసారు. తెదేపాకు చేస్తారో లేదో తెలియదు. కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ సమైక్యమయిపోవచ్చును. కానీ జనసేన ఎవరి వెనుక నడవాలన్నా పార్టీలో ఆయన తప్ప మరెవరూ లేరు గనుక, ఎన్నికల తంతు పూర్తయిపోగానే సినీపరిశ్రమకి తిరిగి వెళ్లిపోతారేమో!