దేశం నుంచి వెళ్లిపోదామనుకున్నపవన్..

పవన్ కళ్యాణ్ భీమవరం సమీపాన ఉన్న నిర్మలా దేవి ఫంక్షన్‌ హాల్లో న్యాయవాదులతో సమావేశమయ్యారు.న్యాయవాదులు రాజకీయాల్లోకి రావాలని పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు. రాజకీయాల్లో ఫైరవీకారులు, బ్రోకర్లు, గూండాలు పెరిగిపోయారన్నారు. వారికి న్యాయవాదుల కష్టాలు ఏమి తెలస్తాయని ప్రశ్నించారు. న్యాయవాదులు సమాజంలో బలమైన మార్పు తీసుకురావాలని కోరారు. న్యాయవాద వృత్తి లో 80శాతం మంది బతకడానికి బాధపడుతున్నారంటే ఆవేదన కలుగుతోందన్నారు. 

 

సంపద సృష్టించే పారిశ్రామికవేత్తలు చాలా సింపుల్‌గా బతుకుతుంటే, పైరవీలు చేసి కోట్లు సంపాదిస్తూ ఖరీదైన కార్లలో తిరుగుతూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారన్నారు. సీఎం తలుచుకుంటే న్యాయ వాదుల సమస్యలు తీరిపోతాయన్నారు. న్యాయవాదులకు జనసేన అండగా ఉంటుందని పవన్‌ హామీ ఇచ్చారు.రాజ్యంగం రాసిన బి.ఆర్. అంబేద్కర్ కూడా ఒక న్యాయవాదే అని పవన్ గుర్తుచేసారు. న్యాయవాదుల గొంతు న్యాయస్థానంలో నాలుగు గోడల మధ్య ఉండిపోకూడదని, ప్రత్యక్షంగా రాజకీయలలోకి రాకపోయినప్పటికీ వివిధ ప్రజా సమస్యల గురించి గళం విప్పాలని పవన్ చెప్పారు. ఈ సమాజంలో ఉన్న కుళ్లు, కుతంత్రాలు చూసి తాను ఈ దేశం నుంచి వెళ్లిపోదామని అనుకున్నానని,కాని ఈ సమాజంలో ఉన్న సమస్యలను తానే ఎందుకు పరిష్కరించుకూడదు అని తనకి తానే ప్రశ్నించుకుని సమాజానికి ఏదో మంచి చేయాలనే తపనే తనను రాజకీయాల వైపు మళ్లించిందని అన్నారు. ఈ సమాజంలో సమస్యలతో పోరాడడానికి న్యాయవాదులందరూ తనతో రావలని ఆయన కోరారు.