కొడంగల్ పై కన్నేసిన కేసీఆర్..

ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి కొన్నాళ్లుగా కొరగాని కొయ్యగా మారారు. నిత్యం విమర్శలు చేస్తూ అధికార పార్టీని ఇరకాటంలో పెడుతున్నారు.రేవంత్‌ను కట్డడి చేసేందుకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ను ఎలాగైనా చేజిక్కించుకోవాలనే లక్ష్యంగా పావులు కదుపుతుందట టీఆర్‌ఎస్‌.

 

 

దీనిపై మంత్రులు కేటీఆర్‌, మహేందర్‌రెడ్డి, జూపల్లి ముఖ్య నేతలతో చర్చించి రేవంత్‌పై బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయిచుకున్నట్లు తెలుస్తోంది.ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి పేర్లు కూడా పరిశీలించారట. దాదాపు అందరూ నరేందర్‌రెడ్డి వైపే మొగ్గుచూపినట్లు సమాచారం.దీంతో కేటీఆర్‌ ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత గుర్నాథ్‌రెడ్డిలను పిలిపించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారట. కొడంగల్ నుంచి నరేందర్‌రెడ్డిని బరిలో దింపేందుకు పార్టీ అధినాయకత్వం నిర్ణయించిందని అందరూ ఇప్పటి నుంచి కష్టపడి పనిచేయాలని కేటీఆర్‌ సూచించారని, దీనికి గుర్నాథ్‌రెడ్డి అంగీకరించినట్లు తెలుస్తోంది. గుర్నాథ్‌రెడ్డికి నామినేటెడ్‌ పదవి ఇచ్చేందుకు పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. కొడంగల్లో రేవంత్‌రెడ్డిని ఢీ కొట్టాలంటే అంగ, అర్థబలం ఉన్న నరేందర్‌రెడ్డినే బరిలో దింపాలని టీఆర్‌ఎస్‌ నాయకత్వం భావించినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు నరేందర్‌రెడ్డి కొడంగల్లో నివసించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని, అక్కడ ఆయన ఓ ఇల్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.