పవన్ కళ్యాణ్ తెదేపాలోకి!

Publish Date:May 25, 2013

 

 

సినిమాలు, రాజకీయాలలో ఎప్పుడు ఏ వార్త ఎక్కడి నుంచి ఎందుకు పుట్టుకొస్తుందో ఎవరూ ఊహించలేరని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. ఇటీవల చంద్రబాబు పాదయాత్ర ముగించుకొని వచ్చిన తరువాత ఆయనను అభినందించడానికి పవన్ కళ్యాణ్ ఆయన సోదరుడు నాగబాబు ఇద్దరూ కలిసి వెళ్ళారనేది ప్రధాన వార్త అయితే, అప్పుడే దానిపై రకరకాల కోణాలలో వేడి వేడి విశ్లేషణలు కూడా వచ్చేస్తున్నాయి.

 

పవన్ కళ్యాణ్, నాగబాబు చంద్రబాబుని కలిసి ఆయనని అభినందించిన తరువాత వారు వచ్చే ఎన్నికలలో తెదేపా ఘన విజయం సాదించాలని కోరినప్పుడు, దానికి జవాబుగా ఆయన ‘మీ సహాయ సహకారాలుంటే మాపని మరింత సులువవుతుందని’ అన్నట్లు, అప్పుడు పవన్ కళ్యాన్ ‘తెదేపా టికెట్ ఇస్తే నేను కృష్ణాజిల్లా నుండి పోటీ చేయడానికి సిద్దం’ అని జవాబిచ్చారనేది దీనికి అనుబంధ వార్త.

 

ఇక ఇక్కడి నుండి విశ్లేషకుల బుర్రలకి పదును పెట్టి ఈ వార్తలకి తమ మేధా శక్తితో మరిన్ని సొబగులు అద్దారు.

 

1.చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్, నాగబాబు ఇద్దరూ ఆ పార్టీ విజయం కోసం చాలా కష్టపడ్డారు. ఎలాగయినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించి తమ పార్టీని అధికారంలోకి తెచ్చి, ఆదర్శవంతమయిన ఒక చక్కటి ప్రభుత్వం ఏర్పరచి రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలోకి తీసుకుపోవాలని కలలు కన్నారు. కానీ చిరంజీవి వారిరువురికి హ్యాండిచ్చి మంత్రి పదవికోసం ‘హ్యాండ్ పార్టీ’కి తమ కలల రాజ్యాన్నిఅమ్మిపడేసి వెళ్ళిపోవడంతో వారిరువురూ ఆగ్రహంతో ఉన్నారు. తమ మెగా జీవికి తగిన బుద్ది చెప్పాలనే ఆలోచనతోనే ‘సరయిన సమయంలో సరయిన మనిషిని’ కలిసారని ఒక విశ్లేషణ.

 

2.ఇక, పార్టీలో తనకు తల నొప్పిగా మారిన హరికృష్ణ, జూ.యన్టీఆర్ లకు చెక్ చెప్పాలంటే పవన్ కళ్యాన్, నాగబాబులని పార్టీలో ఆహ్వానించడమే తగిన మార్గమని చంద్రబాబు అభిప్రాయపడుతున్నట్లు విశ్లేషణ సాగింది. అందువల్ల పవన్ కల్యాణ్ కి మచిలీపట్నం నుండి టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు మరో విశ్లేషణ.

 

3.ఇక, ఈ రకంగా సాగుతున్న విశ్లేషణలకి మనం కూడా ఓ చేయి వేయదలిస్తే ఈ రకంగా వ్రాసుకోవచ్చును. మన లెక్క ప్రకారం తెదేపాలోకి పవన్ కళ్యాణ్, నాగబాబులను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో కేంద్రమంత్రిగా ఒకవెలుగు వెలుగుతున్నచిరంజీవిని రాబోయే ఎన్నికలలో తెదేపా ఎదుర్కోవడం సులువవుతుంది. చిరంజీవి కంటే మంచి వాగ్ధాటి, మంచి పేరూ ఉన్న పవన్ కళ్యాణ్ న్ని ముందుంచుకొని తెదేపా ఎన్నికలకి వెళితే ఆయన ప్రభావం తగ్గించడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోవలనుకొంటున్న ఆయన కాపు కులస్తులను కూడా తెదేపా తనవైపు ఆకర్షించవచ్చును. తద్వారా ఆ కులస్థుల ఓట్లలో పెద్ద చీలిక తేగలిగితే అది కాంగ్రెస్, వైకాపాలా విజయావకాశాలను దెబ్బ తీసి తేదేపాకు విజయం తెచ్చిపెడుతుందని చంద్రబాబు భావిస్తున్నారని వ్రాసుకోవచ్చును.

 

ఇక, ఇంటర్నెట్ లో ఇంత జోరుగా ఈ వార్తలు, విశ్లేషణలు సాగుతుంటే, డేగ కళ్ళతో సంచలన వార్తల కోసం తెగ తిరిగేసే ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియాకు ఇంకా ఈ వార్త గురించి ఉప్పందలేదంటే విశేషమే. లేకుంటే, ఈ పాటికి ఈ సంచలన వార్తని, మన యాంకరమ్మలు వచ్చీరాని తెలుగులో భయంకరమయిన బ్యాంక్ గ్రౌండ్ మ్యుజిక్కుతో, ఒకే క్లిప్పింగుని తిప్పి తిప్పి చూపిస్తూ, బ్రేకుల మద్య మనకి వడ్డించేసేవారేమో!