జనసేనలోకి ఎన్టీఆర్ వస్తే..?

 

ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం కూడా ముగిసింది. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా... ఈ పూజా కార్యక్రమంలో అసలైన స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది మాత్రం పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినిమా ఘనవిజయం సాధించాలని, అంతా మంచి జరగాలని పవన్ కోరుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ను పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఆతరువాత ఎన్టీఆర్ పవన్ చాలా సరదాగా... క్లోజ్ గా మాట్లాడుకున్నారు. ఒకప్పుడు రెండేళ్ల కిందట ఎన్టీఆర్ , పవన్ కళ్యాణ్ ఫాన్స్ మధ్య గొడవ ఓ హత్యకి దారితీసిన ఘటన ఎంత సంచలనం రేపిందో చూసాం. అప్పుడు ఇద్దరు హీరోలు సంయమనం పాటించాలని సూచించారు. ఇప్పుడు ఇద్దరూ కలిసిపోయి అభిమానులకు.. ఎలా మెలగాలి అన్న సందేశం ఇచ్చారు. ఇక ఇదే పవన్ కు ప్లస్ పాయింట్ అవ్వనున్నట్టు భావిస్తున్నారు.

 

ఇక ఇదంతా చూస్తుంటే ఇదేదో పొలిటికల్ గా పవన్ కు బాగానే ఉపయోగపడేట్టు కనిపిస్తోంది. పవన్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రానున్న సంగతి తెలిసిందే. దానికి ఇప్పటినుండే ఆయన స్కెచ్ వేస్తున్నారు. పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ రెడీ చేస్తున్నారు. పార్టీ ప్లీనరీ, తన పాదయాత్ర , ఎప్పుడు, ఎక్కడి నుంచి దీన్ని  చేపట్టాలన్న దానిపై త్వరలో పవన్ నిర్ణయం తీసుకోనున్నారు.

 

మరోవైపు టీడీపీ అధినాయకత్వం ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా ఉంది. తాత పోలికలు, మంచి వాగ్దాటి, మాస్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ తన వారసుడి రాజకీయ భవిష్యత్తుకు ఎక్కడ అడ్డువస్తాడో అని చంద్రబాబు నాయుడు 2009 తరువాత ఎన్టీఆర్ ను దూరం పెడుతూ వచ్చారు. దీనికి తోడు హరికృష్ణ, వల్లభనేని వంశీ, కొడాలి నాని కలిసి ఎన్టీఆర్ కు ప్రాధాన్యత ఇవ్వాలని 2014 సమయంలో గట్టిగా పోరాడారు. అయితే అపర చాణుక్యుడు ముందు వారి ఆటలు సాగలేదు. పార్టీ శ్రేణులతో పాటు అన్నగారి కుటుంబం నుండి ఎన్టీఆర్ ను విడదీసేందుకు బాలయ్యను రంగంలోకి దించారని రాజకీయవర్గాల్లో చర్చ నడిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చాడు జూనియర్. అయితే జనసేనను వచ్చే ఎన్నికల నాటికి సంస్థాగతంగా పటిష్టపరచాలని చూస్తున్న ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దీనిలో భాగంగా ఎన్టీఆర్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. తన గేమ్ ప్లాన్ లో భాగంగా.. తన ప్రియమిత్రుడు త్రివిక్రమ్ తో సినిమా చేయించి.. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ కు గాలం వేయాలని భావిస్తున్నట్టు జనసేన కాంపౌండ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కనుక పవన్ తో చేరితే అది వెయ్యి ఏనుగుల బలంతో సమానం అవుతుంది. ఎందుకంటే జనసేనలో పవన్ ఒక్కడే స్టార్ క్యాంపెయినర్. 2019 నాటికి మెగా ఫ్యామిలీ పవర్ స్టార్ వెంట నడుస్తుందో లేదో తెలియదు..? కాబట్టి ఈ పరిస్థితుల్లో పార్టీ ప్రజల్లోకి వెళ్లాలంటే.. అది పవన్ ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. సో.. ఎన్టీఆర్ లాంటి స్టార్ డమ్ ఉన్న వ్యక్తి జనసేనలో చేరితే పార్టీని జనాల్లోకి బలంగా వెళుతుంది.

 

మరో వెర్షన్ చూస్తే.. తొలి నుండి నందమూరి, కొణిదల కాంపౌండ్ ల మధ్య ఆధిపత్య పోరు నడిచింది. ఇద్దరి సామాజిక వర్గాలు వేరు. ఎన్టీఆర్ ఆ సామాజిక వర్గానికి దగ్గర అయితే.. సొంత సామాజిక వర్గానికి దూరమవుతాడు. అప్పుడు ఎన్టీఆర్ ను దూరం పెట్టడానికి చంద్రబాబుకు మరో అవకాశం దొరికినట్టు అవుతుంది. కాబట్టి ఎన్టీఆర్ పవన్ గాలానికి చిక్కుతాడా...?లేక...? ఇవన్నీ పుకార్లా..? అన్నది త్వరలోనే తేలిపోతుంది.