రాష్ట్ర విభజన తర్వాత శిక్షణ పూర్తి చేసుకున్న తొలి డీఎస్పీల టీమ్...

 

పోలీసులకు వారాంతంలో సెలవులు ఇచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు ఏపీ హోంమత్రి సుచరిత. డ్రగ్స్, వైట్ కాలర్ నేరాలను అరికట్టాలని సూచించారు. మంగళగిరి ఆరవ పోలీస్ బెటాలియన్ లో ఇవాళ డీఎస్పీల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత శిక్షణ పూర్తి చేసుకున్న తొలి డీఎస్పీల టీమ్ ఇదే. ఈ టీమ్ లోని మొత్తం ఇరవై ఐదు మంది డీఎస్పీలలో పదకొండు మంది మహిళలు ఉన్నారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న డీఎస్పీల నుంచి హోంమంత్రి సుచరిత గౌరవ వందనం స్వీకరించారు. వృత్తిపరమైన సవాళ్లను అధిగమించి ప్రజాసేవ దిశగా ముందుకు వెళ్లాలని పిలుపు నిచ్చారు ఆమె. గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. 

సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కొత్త డీఎస్పీలకు చెప్పారు డిజిపి సవాంగ్. విధి నిర్వహణలో అనేక సవాళ్లు, అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయని, వాటన్నింటిని విజయవంతంగా ఎదుర్కోవాలంటే ధైర్యం, సంకల్పం మరియు ఉన్నత విలువలతో వ్యవహరించవలసినటువంటి అవసరముంది అన్నారు. మన జనాభాలో డెబ్బై శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు అని, అందువలన గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలపై లోతైన అవగాహన మీరు కలిగి వుండవలసినటువంటి అవసరం ఉందని అందుకోసం విస్తృతంగా గ్రామాల్లో మీరు పర్యటించాలి అని, వారితో మమేకమవ్వాలి అని సూచించారు.