కేరళ నర్స్ ప్రియకు ఉరి నుంచి ఊరట!

ఆశలన్నీ ఆవిరై పోయిన సందర్భంలో.. కేరళ నర్స్‌ నిమిష ప్రియకు ఊరట లభిచింది. మరో కొన్ని గంటల్లో ఉరి కంబం ఎక్కవలసిన ఆమెకు, యెమెన్‌ ప్రభుత్వం ఉరి శిక్షను వాయిదా వేసి, మరో ఆశకు ప్రాణం పోసింది.  నిజానికి మరి కొద్ది గంటల్లో అంటే బుధవారం (జులై 16) అమలు కావాల్సిన ఆమె ఉరిశిక్షను యెమెన్‌ ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది. ఆమె మరణశిక్షను తప్పించడానికి యెమెన్‌ జైలు అధికారులతోపాటు ప్రాసిక్యూషన్‌ కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.

 ఈ కేసులో బాధితురాలికి సాయం చేసేందుకు భారత్ ప్రభుత్వం మొదటి నుంచి తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. నిమిష, బాధిత కుటుంబాల మధ్య పరస్పర అంగీకారం వచ్చేలా చేసి  కేసును పరిష్కరించుకునేలా మరింత సమయం ఇవ్వాలని కోరాం. ఈ విషయంలో స్థానిక జైలు అధికారులు, ప్రాసిక్యూటర్‌ ఆఫీసుతో నిరంతరం జరిపిన సంప్రదింపులు ఫలించాయి. మరణశిక్ష అమలును వాయిదా వేసేందుకు యెమెన్‌ అధికారులు అంగీకారం తెలిపారని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ కేసులో బ్లడ్ మనీ తీసుకునేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్‌ ముస్లియార్‌ సంప్రదింపులు జరపుతున్నారు. ఆ చర్చలు కూడా సానుకూలంగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. బాధిత కుటుంబానికి ఒక మిలియన్‌ డాలర్ల అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.8.6కోట్ల  క్షమాధనాన్ని ఇచ్చేందుకు నిమిష ప్రియ కుటుంబం సిద్దంగా ఉంది. ఇందుకు బాధిత కుటుంబం అంగీకరిస్తే నిమిష ప్రియకు మరణశిక్ష తప్పే అవకాశం ఉంది.
 
అసలింతకీ ఏమిటీ కేసు అంటే.. కేరళ పాలక్కాడ్‌ జిల్లాకు చెందిన నిమిష నర్సు కోర్సు పూర్తి చేసిన తర్వాత 2008లో యెమెన్‌ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరారు. 2011లో థామస్‌ను వివాహం చేసుకున్న ఆమె అక్కడే ఓ క్లినిక్‌ తెరవాలనుకొన్నారు.ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక తలాల్‌ అదిబ్‌ మెహది అనే వ్యక్తిని నిమిష, థామస్‌ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకుంది. వారు అల్‌అమన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ సెంటర్‌ను ప్రారంభించారు. కొన్నేళ్ల తర్వాత ఆమె భర్త, కుమార్తె కేరళకు వచ్చేశారు. నిమిష యెమెన్‌లోనే ఉంటూ సెంటర్‌ను కొనసాగించారు.

ఈ సమయంలో మెహది- నిమిష ప్రియను తన భార్యగా పేర్కొంటూ వేధింపులకు గురిచేస్తూ ఆమె పాస్‌పోర్టు లాక్కొన్నాడు. అతడిపై 2016లో ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోయేసరికి, 2017లో మెహదికి మత్తు మందు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని ఆమె భావించింది. మోతాదు ఎక్కువవడంతో అతడు చనిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ వాటర్‌ ట్యాంక్‌లో పడేసింది. అక్కడి నుంచి సౌదీకి పారిపోతుండగా ఆమెను అరెస్టు చేశారు. ఈ కేసులో 2020లో ఆమె ఉరిశిక్ష విధించగా, 2023లో చివరి అప్పీల్‌ను యెమెన్‌ ప్రభుత్వం తిరస్కరించింది. ప్రస్తుతం నిమిష ప్రియ యెమెన్‌ రాజధానిలోని సనా జైలులో ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu