బీజేపీలోకి నేదురుమల్లి కుమారుడు

 

మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జానార్ధన రెడ్డి కుమారుడు, పీసీసీ ప్రధాన కార్యదర్శి, నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి నిష్క్రమించారు. ఈయన ఆదివారం బీజేపీలో చేరిన సందర్భంగా జిల్లా కేంద్రంలో బహిరంగసభ నిర్వహించారు. ఈ సభకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీజేపీలో రాంకుమార్ రెడ్డి చేరిక తమకు ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ కు 'ప్రత్యేక హోదా' అంశాన్నికాంగ్రెస్ పార్టీ బిల్లులో ప్రస్తావించలేదని, ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చకుండా సోనీయా గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ధికోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల గొంతు కోసిందన్నారు. విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి తమ ప్రభుత్వం చాలా కృషి చేస్తుందన్నారు. రెవెన్యూ లోటును పూడ్చేందుకు ఐదేళ్లలో రూ.26,819 కోట్ల నిధులను కేటాయించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం రూ.1,000 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ నెల 28న తిరుపతిలో ట్రిపుల్ ఐటీ, ఐఐటీ సంస్థలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. గంగా, కావేరి నదులతోపాటు కృష్ణా, పెన్నా, గోదావరి నదులను అనుసంధానిస్తామన్నారు.