20న జాతీయ రహదారుల దిగ్బంధం
posted on Aug 17, 2013 9:10AM
.jpg)
సమ్మె ఆగదు. ఆపేది లేదు. మరింత తీవ్రం చేస్తాం. సీమాంధ్ర ఎంపీలందరూ రాజీనామాలు చేసేదాకా వెనక్కి తగ్గేదే లేదు.. అని సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నేతలు తేల్చిచెప్పారు. ఈ నెల 19 నుంచి సీమాంధ్ర వ్యాప్తంగా ఒకేవిధమైన ఉద్యమ కార్యాచరణ అమలు చేస్తామని అశోక్‌బాబు ప్రకటించారు. "19న అన్ని ప్రాంతాల్లో బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించాలి. 20వ తేదీన పూర్తిస్థాయిలో రహదారులను దిగ్బంధించాలి. 21వ తేదీన సీమాంధ్రలో ప్రజలు తరలివచ్చి ఉదయం 10.30 గంటల నుంచి 11 వరకు అన్ని జాతీయ రహదారులపై మానవ హారాలు నిర్మించి సమైక్యాంధ్ర నినాదాలు చేయాలి. అదే రోజున సాయంత్రం 6.30 గంటల నుంచి కొవ్వొత్తులు, కాగడాలతో ప్రదర్శన నిర్వహించాలి. 22, 23వ తేదీలలో తాలూకా, డివిజన్, జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలి. ఇందులో... అన్ని సంఘాల నాయకులు పాల్గొనాలి.
24 నుంచి 30వ తేదీ వరకు వరకు ఉద్యోగులు, నాయకులు, కార్మికులు కుటుంబ సభ్యులతో సహా ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించాలి'' అని అశోక్‌బాబు పిలుపునిచ్చారు. త్వరలో హైదరాబాద్‌లో మహాసభ నిర్వహిస్తామని... రాష్ట్రం ఎందుకు సమైక్యంగా ఉండాలో అవగాహన కల్పించడమే దీని ఉద్దేశమని ప్రకటించారు. ఉద్యోగులు చేపట్టిన సమైక్య సమ్మెకు మద్దతు ఇచ్చే ఏ రాజకీయ పార్టీ నాయకుడినైనా తాము ఆదరిస్తామని అశోక్‌బాబు స్పష్టం చేశారు.