పసిమొగ్గలపై "పశు"క్రీడను ఆపలేమా..?

భారతదేశంలో ఇంటికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో..విద్యాలయాలకు అంతటి విశిష్టత ఉంది. తమ పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించి, సరైన నడవడికతో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారనే నమ్మకంతో గురువుల చేతిలో పెడతారు తల్లిదండ్రులు. పూర్వం చిన్నారులను వారి తల్లిదండ్రులు గురుకులాలకు పంపేవారు..ఆ విద్యార్ధులు 12 సంవత్సరాల పాటు గురుసేవ చేసుకుంటూ వేదాలు, రామాయణ, మహాభారతాలు, ఇతర కావ్యాలు అభ్యసించేవారు. మహా పండితులైన వారి పుత్రులైనా, చక్రవర్తుల పిల్లలైనా అక్కడే చదువుకుంటూ అక్కడి పనుల్లో పాలుపంచుకోవాలి. పుష్కరకాలం పాటు తమ కంటి వెలుగులను ఎక్కడో ఉంచి వెళుతున్నారంటే ఆ తల్లిదండ్రులకు ఆ గురుకులంపై ఎంతటి నమ్మకం ఉండాలి. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ..తమ బాధ్యతను నెరవేర్చేవారు నాటి గురువులు.

 

అయితే నేటి గురుకులాలు అలాంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాయా అంటే కాదనే చెప్పాలి. ప్రేమగా..బాధ్యతతో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన వాళ్లే..చిన్న పిల్లలని కూడా చూడకుండా ఒళ్లు మరచిపోతున్నారు..ప్రేమ, అప్యాయత కురిపించాల్సిన కళ్లు కామంతో చూస్తుంటాయి. తమను తడుముతుంటే నవ్వులు చిందించడం తప్ప ..ఏం జరుగుతుందో..వాళ్లు ఎందుకలా చేశారో కూడా చెప్పలేని..గుర్తించలేని వయసు వారిది..లైంగిక వేధింపులు అనే పదానికి అర్థం కూడా తెలియని వయసులో వారు వేధింపులకు గురికావడం ఏంటీ..? మన సమాజం ఎటు పోతోంది..? ఈ ప్రశ్నకు సమాధానం తెలియక దిక్కోతోచని స్థితిలో ఎంతో మంది తల్లిదండ్రులు ఈ దేశంలో అడుగడుగునా కనిపిస్తారు.

 

స్కూళ్లు, గేటేడ్ కమ్యూనిటీలు, కేర్ టేకర్ సెంటర్లు, హాస్టల్స్, ప్లేస్కూల్స్ ఇలా పేరేదైనా గురుకులాల్లో చిన్నారులకు రక్షణ లేకుండా పోతోంది. పాఠాలు చెప్పాల్సిన టీచర్లు, సహాయక సిబ్బంది, చివరకు రోజు స్కూలుకు తీసుకువెళ్లే బస్సు డ్రైవర్లు, కండక్టర్లు ఇలా ఎవరో ఒకరు బాల్యాన్ని కబళిస్తున్నారు. దేశ రాజధాని నుంచి మారుమూల పల్లెల వరకు నిత్యం ఏదో ఒక మూల పిల్లలపై లైంగిక దాడి జరుగుతూనే ఉన్నట్లు గణంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే తమ లైంగిక దాడిని పిల్లలు ప్రతిఘటిస్తే..ఏ మాత్రం జాలి లేకుండా వారిని కడతేరుస్తున్నారు కామాంధులు.

 

కొద్దిరోజుల క్రితం దేశాన్ని కుదిపేసిన ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగింది ఇదే. ఒంటరిగా కనిపించిన చిన్నారిపై లైంగిక దాడికి ప్రయత్నించిన పాఠశాల వ్యాన్ డ్రైవర్ బాలుడు తనను అడ్డుకునే సరికి పట్టరాని ఆవేశంతో చిన్నారి గొంతు కోసి ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. చాప కింద నీరులా వ్యాపిస్తున్న ఈ సమస్యను అడ్డుకోవడం అంత సులభం కాదు. ఈ విషయంలో అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాల్సింది పాఠశాల యజమాన్యాలే..పిల్లలు చదువులో వెనకబడటం, ఎవరినైనా చూసి భయపడటం, ఒంటిరిగా తమలో తాము కుమిలిపోవడం, ప్రవర్తనలో, మాటల్లో తేడా ఇలాంటివి గమనిస్తే వెంటనే వారిని సైక్రియాట్రిస్తు దగ్గరికి తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించండి. సావదానంగా వారిపై అలా ప్రవర్తించింది ఎవరో కనుక్కొని చట్టానికి అప్పగించండి. దానితో పాటు వర్క్‌షాపులు నిర్వహించి పిల్లలకు స్వీయరక్షణ చిట్కాలు నేర్పడం ద్వారా కొన్ని దారుణాలనైనా ఆపడం సాధ్యమవుతుంది.