జగన్ కు దెబ్బ మీద దెబ్బ.. మరో వైసీపీ ఎమ్మెల్యే జంప్

 

వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. రెండు రోజుల క్రితమే గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి టీడీపీలో చేరారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా జగన్ కు షాకిచ్చాడు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పోతుల రామారావు కూడా టీడీపీ లో చేరారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పోతుల రామారావు, ఆయన అనుచరులు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోతుల రామారావు మాట్లాడుతూ.. నవ నిర్మాణ దీక్ష రోజునే టిడిపిలో చేరడం ఆనందంగా ఉందని అన్నారు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నందునే తెలుగుదేశం పార్టీలో చేరానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శిద్ధా రాఘవరావు, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా ఇప్పటికి 18 మంది ఎమ్మెల్యేలు టీడీపీ లో చేరారు.