ఎమ్మెల్యేలా? కోడి పిల్లలా?
posted on Jun 1, 2015 12:50PM

ఎమ్మెల్యేలను చూస్తుంటే గౌరవాభిమానాలు పోయి చాలాకాలం అయింది. మొన్నామధ్య వరకు వారిని చూస్తుంటే మనుషులను చూసినట్టయినా వుండేది, అయితే ప్రస్తుతం రాజకీయ పోరాటంలో, ఆధిపత్య పోరాటంలో భాగంగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఎమ్మెల్యేలు వెన్నెముక ఉన్న మనుషులా... లేక కోడిపిల్లలా అనే సందేహం కలుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, అంతకుముందు పలు పార్టీలు అధికార పార్టీ నుంచి తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను చూస్తుంటే గద్దల బారి నుంచి తన పిల్లలను కాపాడుకోవడానికి తంటాలు పడే కోడి గుర్తుకు వస్తోంది. ఎమ్మెల్యేలు కోడి పిల్లల మాదిరిగా అనిపిస్తున్నారు. కోడి ఎన్ని తంటాలు పడినా అప్పుడప్పుడు కొన్ని కోడి పిల్లలు గద్ద బారిన పడినట్టే ఎమ్మెల్యేలు కూడా హాంఫట్ అయిపోతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష పార్టీలో తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి పడుతున్న తంటాలను చూస్తుంటే నవ్వొస్తోంది. ఎన్నికలకు ముందు రోజు నుంచి తమ ఎమ్మెల్యేలందరితో క్యాంప్ ఏర్పాటు చేసుకోవడం, ఒక్క ఎమ్మెల్యే కూడా గూడులోంచి బయటపడకుండా జాగ్రత్తలు తీసుకోవడం. అందరూ ఒకేచోట వుండేలా చూసుకోవడం. అందరూ కలసి ఒకేసారి వచ్చి ఓటుహక్కు వినియోగించుకోవడం... అభద్రతాభావంతో కూడిన ఈ చర్యలన్నీ చూస్తుంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎలాంటి దుస్థితి వచ్చిందిరా భగవంతుడా అని బాధపడాల్సి వస్తోంది. మరి మనం మళ్ళీ మన ఎమ్మెలను కోడి పిల్లల్లా కాకుండా వెన్నెముక వున్న మనుషుల్లా ఎప్పటికైనా చూడగలుగుతామో... లేదో!