ఎంతపని చేశావ్ జగన్?!
posted on Jun 1, 2015 12:38PM

వైసీపీ నాయకుడు జగన్ ఏ పని చేసినా పప్పులో కాలు వేసే విధంగా చేస్తూ వుంటారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించినప్పుడు ఒకపక్క అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతూ వుండగానే తననే ముఖ్యమంత్రి చేయాలని సంతకాల సేకరణ జరిపినప్పటి నుంచి జగన్ తప్పటడుగులను జనం చూస్తూనే వున్నారు. ముఖ్యమంత్రి అయిపోవాలన్న ఆయన తహతహ కాంగ్రెస్ అధిష్ఠానానికి నచ్చలేదు. దాంతో పక్కన పెట్టేసింది. చివరికి జగన్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో జగన్ కాస్తంత ఓర్పుతో వ్యవహరించినట్టయితే తర్వాత అయినా ముఖ్యమంత్రి అయ్యేవారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ వుంటాయి. అలా ఓర్పు లేకుండా వ్యవహరించడం వల్లే ఆయన ఇప్పటికీ ఓదార్పు యాత్రలు చేసుకుంటూ కాలక్షేపం చేయాల్సి వస్తోంది. జగన్ ప్రస్తుతం వున్న స్థితికి ఆయన వేసే తప్పటడుగులే ప్రధాన కారణం అని రాజకీయ పరిశీలకులు అంటూ వుంటారు. అలాంటి తప్పటడుగు ఆయన మరోసారి వేశారు.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీకి తెలంగాణలో వున్న ఒకే ఒక ఎమ్మెల్యే మద్దతు టీఆర్ఎస్‌కి ఇవ్వడం జగన్ చేసిన ఒక చారిత్రాత్మక తప్పిదంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర విభజనకు కారణం కావడంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా పాతాళానికి పడిపోవడానికి కారణం అవడం, నిరంతరం సీమాంధ్రులను తిట్టిపోసే టీఆర్ఎస్ అంటే సీమాంధ్రులకు ఎంతమాత్రం సదభిప్రాయం లేదు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో జగన్ పార్టీ టీఆర్ఎస్‌కి మద్దతు ఇవ్వడాన్ని సీమాంధ్రుల జీర్ణించుకునే అవకాశం ఎంతమాత్రం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జగన్ ఇప్పుడు వేసిన ఈ అడుగు భవిష్యత్తులో ఆయనకు రాజకీయంగా ఎంతో నష్టం చేసే అవకాశం వుందని అంచనా వేస్తున్నారు. అయినా, తన పార్టీ నుంచి ఎమ్మెల్యేలను లాక్కుని, తెలంగాణలో తన పార్టీని ఒక్క ఎమ్మెల్యేకే పరిమితం చేసిన టీఆర్ఎస్‌కి జగన్ మద్దతు ఇవ్వడం విచిత్రంగా వుందని, తెలుగుదేశం మీద కోపంతో టీఆర్ఎస్‌కి జగన్ మద్దతు ఇవ్వడం పెద్ద కామెడీగా వుందని అంటున్నారు. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే అయితే టీఆర్ఎస్‌కి మద్దతు ఇచ్చారో, ఆ ఎమ్మెల్యే భవిష్యత్తులో టీఆర్ఎస్‌లోకి జంప్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.