అందుకే కాంగ్రెస్ తో కలిసి వెళుతున్నాం

 

ఏపీ సీఎం చంద్రబాబు జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేయడానికి సిద్దమైన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు చేస్తాం కానీ నాయకత్వం వహించబోమని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి పదవిని చంద్రబాబు ఆశించడం లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని తేల్చిచెప్పారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమి ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఇందులో భాగంగానే రాహుల్‌గాంధీతో చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము ఎన్డీఏలో చేరామని, అయితే బీజేపీ నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు.

ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేరుస్తామని కాంగ్రెస్‌ చెప్పిందన్నారు. అధికారంలోకి రాగానే హోదాపైనే తొలి సంతకం చేస్తామని రాహుల్‌ ప్రకటించారన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా ప్రత్యేక హోదా కోరుకుంటున్నారని తెలిపారు. బీజేపీ మోసం చేసింది కాబట్టే కాంగ్రెస్‌తో వెళుతున్నామని అన్నారు. చంద్రబాబును నమ్మి అన్ని పార్టీల నేతలు కలిసి వస్తున్నారన్నారు. తమది ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ జాతీయభావాలు ఉన్నాయని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.