పెళ్లి చూపులకు గుర్తింపుకార్డంట..!

దేశంలో ఏ పని కావాలన్నా గుర్తింపుకార్డు తప్పనిసరి..సిమ్ కార్డు దగ్గరి నుంచి ఓటు వేసే వరకు ఐడెంటి కార్డు లేనిదే ఏ పని జరగదు. తాజాగా పెళ్లిచూపులకు కూడా గుర్తింపుకార్డు కార్డు కావాలంట. ఇదివరకటి రోజుల్లో పెళ్లిచూపులంటే తెలిసినవాళ్లు.. తెలిసిన సంబంధాలు తెచ్చేవారు కాబట్టి ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండేవి కావు. కాని సాంకేతిక విప్లవం పెరిగి ప్రపంచం ఓ కుగ్రామంగా మారడంతో ఇప్పుడు అరచేతుల్లోనే అంతా జరిగిపోతోంది. దీనికి వివాహాది కార్యాలు మినహాయింపుకాదు. స్కైప్‌లోనే పెళ్లి చూపులు...నిశ్చితార్ధాలు జరుపుకోవడం మనం చూస్తునే ఉన్నాం. దేశంలో మ్యాట్రిమోనిలు పెరిగిపోవడం, వేళాపాళా లేని ఉద్యోగాల వల్ల ఆన్‌లైన్‌లోనే లుకింగ్స్ కానిచ్చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకుంటే చాలు కోరిన సమయంలో..కోరిన వ్యక్తి ఇష్టాయిష్టాలు తెలుసుకునే వెసులుబాటు కనిపిస్తున్నాయి మ్యాట్రిమోనిలు.

 

సెల్‌ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ ఉంటే చాలు ఎవరైనా సరే తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఈ పద్ధతి వల్ల ఫేక్ ప్రోఫైల్స్, మోసాలు పెరుగుతుండటంతో కేంద్రప్రభుత్వం వీటిపై దృష్టిసారించింది. కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రిగా మేనకా గాంధీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆన్‌లైన్‌లో పెళ్లి ప్రకటనల్లో మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే ఈ విధానంలో కొత్త మార్గదర్శకాలను రూపొందించేందుకు ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటీ వివిధ వెబ్‌సైట్లు, మ్యాట్రిమోనిల ప్రతినిధులతో చర్చలు జరిపి కొత్త నియమనిబంధనలను రూపొందించినట్టు తెలుస్తోంది. ఇకపై ఆన్‌లైన్‌లో పెళ్లి ప్రకటన ఇవ్వాలంటే ప్రభుత్వ గుర్తింపు కార్డులైన ఆధార్, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ తదితర గుర్తింపుకార్డులను తప్పనిసరి చేయాలని యోచిస్తోంది. అంతేకాకుండా ప్రకటన ఇచ్చే సమయంలో షరతులను ప్రకటనదారుడు ఖచ్చితంగా ఒప్పుకోవాలని, పెళ్లి సంబంధాల వెబ్‌సైట్లలో తప్పనిసరిగా ఫిర్యాదుల అధికారి వివరాలు తెలపాలని కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.