న్యాయవ్యవస్థలో అన్యాయాలపై మార్కండేయాస్త్రం

 

దేశానికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. అది రాజకీయ ఒత్తిళ్లకు, అవినీతికి దూరంగా ఉంటుందని ప్రజల నమ్మకం. కానీ ఏకంగా ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు-ఆర్.సి. లహోటి, వైకె సబర్వాల్ మరియు కేజి బాలకృష్ణన్ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గారని సుప్రీం కోర్టుకే చెందిన మాజీ జడ్జి మార్కండేయ కట్జూ ఆరోపించడం, వారిలో లాహోటీ అవినీతి మరకలు అంటుకొన్న న్యాయమూర్తిని పదవిలో కొనసాగించారని ఆరోపించడంతో న్యాయవ్యవస్థ కూడా ఈ రొంపిలో చిక్కుకొంది.

 

మార్కండేయ కట్జూ కేవలం ఆరోపణలు చేయడమే కాకుండా వాటికి తన వద్ద బలమయిన సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెపుతూ, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్.సి లహోటీకి సంధించిన ఆరు ప్రశ్నలు గమనిస్తే ఆ ఆరోపణలను నమ్మవలసిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ప్రధాన న్యాయమూర్తులే కట్జూ ప్రశ్నలకు సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. అంతేగాక ఈ ఆరోపణలలో నిజానిజాలను సుప్రీంకోర్టు తక్షణమే విచారించి దోషులెవరో తేల్చి, న్యాయవ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు వారిని కటినంగా శిక్షించి, చట్టానికి ఎవరూ అతీతులు కారని నిరూపించి న్యాయవ్యవస్థ ప్రతిష్టను పునరుద్దరించాలి. లేకుంటే ప్రజలకు న్యాయవ్యవస్థపై ఉన్న అపార నమ్మకం,  గౌరవం సడలే ప్రమాదం ఉంది.

 

 అయితే ఇన్నేళ్ళు మౌనంగా ఊరుకొని ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తునారనే ప్రశ్నకు మార్కండేయ కట్జూ టక్కున మహేష్ బాబులా, ఎప్పుడు ప్రశ్నించామన్నది పాయింటు కాదు... ఆ ప్రశ్న సరయినదా కాదా? అన్నదే పాయింటు అని సమాధానం చెప్పి తన విమర్శకుల నోళ్ళు మూయించేరు. అయితే వ్యవహారంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షం డీయంకే తీరు చూస్తుంటే గుమ్మడి కాయల దొంగ అంటే..భుజాలు తడుముకొన్నట్లుంది. కట్జూ ముగ్గురు ప్రధాన న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తుంటే, ఈ భాగోతాలన్నీ తమ యూపీఏ హయాంలోనే జరిగాయి గనుక, కాంగ్రెస్ పార్టీని అప్రదిష్ట పాలు చేసేందుకే కట్జూ ఈ టైమింగ్ఎంచుకొన్నారని, ఆయన వెనుక బీజేపీ నేతల కుట్ర ఉందని కాంగ్రెస్ ప్రత్యారోపణలు చేస్తోంది. ఇది సమస్యను పక్కదారి పట్టించడానికే చేస్తున్న ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. గత పదేళ్లలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం చాలా సార్లు చాలా అధికార దుర్వినియోగానికి పాల్పడినపుడు స్వయంగా సుప్రీంకోర్టే ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన సంగతి కాంగ్రెస్ మరిచిపోవచ్చునేమో కానీ ప్రజలు మరిచిపోరు. దేశంలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన యూపీఏ ప్రభుత్వం న్యాయవ్యవస్థను, చివరికి సర్వోన్నత న్యాయ స్థానానికి కూడా ఈ అవినీతి జబ్బును అంటించి దాని పరువు ప్రతిష్టలు కూడా మంటగలిపినట్లు మార్కండేయ కట్జూ ఆరోపణలు దృవీకరిస్తున్నాయి.

 

ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ అంగీకరించకపోవచ్చును. చేసిన పనికి సిగ్గుపడక పోవచ్చును. దానివలన కాంగ్రెస్ పార్టీ కొత్తగా కోల్పోయేదేమీ లేదు. ఆ పార్టీ పరువు ప్రతిష్టలు, ప్రజలలో గౌరవం అన్నీ ఇప్పటికే చాలా వరకు తుడిచిపెట్టుకు పోయాయి. కానీ దేశంలోసర్వోన్నత న్యాయవ్యవస్థపై ఇటువంటి మచ్చపడటం ఉపేక్షించవలసిన విషయం కాదు. అందువల్ల సుప్రీంకోర్టే తగుచర్యలు చేప్పట్టి కట్జూ ఆరోపణలతో మసకబారిన తన ప్రతిష్టను పునరుద్దరించుకోవలసిన నైతిక బాద్యత ఉంది.