జడల నాగరాజు ఏమయ్యాడు ?
posted on Mar 14, 2012 10:10AM
మాజీ నక్సలైట్ జడల నాగరాజు ఆచూకీ చాలాకాలంగా తెలియడంలేదు. రెండున్న నెలల క్రితం అతను అదృశ్యమయ్యాడు. గతంలో పోలీసులకు కోవర్ట్ గా పనిచేసిన నక్సలైట్ నాగరాజు మావోయిస్టులపై కోలుకోలేని దెబ్బకు కారణమయ్యాడు. అతను అందించిన సమాచారంతో పోలీసులు కొందరు ప్రముఖ మావోయిస్టులను మట్టుబెట్టగలిగారు. కోవర్ట్ గా మారిన నాగరాజు పోలీసుల అండదండలతో సెటిల్ మెంట్లు అనేకం చేశాడు. పెద్ద ఎత్తున డబ్బు కూడా ఆర్జించాడని చెబుతున్నారు. అటువంటి వ్యక్తి డిసెంబర్ 7న బయటకు వెళుతూ తాను 15 రోజుల వరకు ఇంటికి రానని, తనకు ఫోన్ చేయవద్దని, తానే ఫోన్ చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిన వ్యక్తి ఇంతవరకు తిరిగి రాలేదు. దీంతో నాగరాజు సోదరుడు జడల సురేందర్ కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగరాజును మావోయిస్టులు ఎప్పటినుంచో టార్గెట్ గా పెట్టుకున్నారు. దీనికితోడు పోలీసులు కూడా జడల నాగరాజుతో అవసరం తీరిపోయిందని, అతన్ని వదిలించుకుని ఉండవచ్చునన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.