మోడీజీ ఇప్పటికైనా తప్పు ఒప్పుకోండి..
posted on Nov 7, 2017 9:54AM
.jpg)
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీకి తప్పు ఒప్పుకోమని ఓ సలహా ఇచ్చారు. ఇంతకీ మోడీ చేసిన తప్పు ఏంటీ... మన్మోహన్ సలహా ఎందుకు ఆ సలహా ఇచ్చారనేగా సందేహం. అసలు సంగతేంటంటే... త్వరలో గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మన్మోహన్ సింగ్ ప్రధాని తీసుకున్న నిర్ణయాలను తప్పుబట్టారు. మోడీ తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ అమలు నిర్ణయాలు.. భారత ఆర్థిక వ్యవస్థ ను తీవ్రంగా ప్రభావితం చేశాయని, ఆ రెండూ మోదీ చేసిన అతిపెద్ద తప్పులని, ఇప్పటికైనా, మోదీ తన తప్పును అంగీకరించాలని అన్నారు. అంతేకాదు... మోదీ నిర్ణయాలు భారత వ్యవస్థకు విపత్తులను తెచ్చి పెట్టాయని, ఇండియా వంటి దేశంలో తొందరపాటు నిర్ణయాలు ఎలాంటి వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తాయన్న విషయం మోదీ అమలులోకి తెచ్చిన నోట్లరద్దు, జీఎస్టీతో బహిర్గతమైందని ఆరోపించారు. తాను చేసిన అతిపెద్ద తప్పును మోదీ అంగీకరించి, భారత వ్యవస్థను తిరిగి నిలిపేందుకు కృషి చేయాలని, లేకుంటే, ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహాన్ని ఆయన ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరించారు.