మహానాడుకి వేదిక తిరుపతి..

తెలుగుదేశం పార్టీ పండుగగా జరుపుకునేది మహానాడు. అన్న నందమూరి తారకరామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మే 27, 28, 29 తేదిల్లో మహానాడు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజున పార్టీ భవిష్యత్ కార్యాచరణ, వివిధ ఏజెండాలపై తీర్మానాలను ప్రకటిస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల నుంచి పసుపుదండు కదిలివస్తుంది. ఇప్పటి వరకు మహానాడుకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్ సమీపంలోని గండిపేట. పార్టీ ఆవిర్భవించిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఈ వేడుకకి అతిథ్యమిచ్చిన గండిపేట తెలుగువిజయం ప్రాంగణం ఈసారి పక్కకు తప్పుకుంది. దీని స్థానంలో టెంపుల్ టౌన్ తిరుపతి స్క్రీన్ మీదకు వచ్చింది.

 

మహానాడు ఏర్పాట్లకు సంబంధించి ఏర్పాటైన సమన్వయ కమిటీ వేదిక ఎక్కడ అనేది తేల్చడానికి పలుసార్లు భేటీ అయ్యింది. హైదరాబాద్ లేదా విజయవాడలో నిర్వహించాలని తొలుత భావించినా..చివరికి తిరుపతిని ఎంపిక చేశారు.  రాష్ట్ర విభజన తర్వాత కూడా గత ఏడాది మహానాడును హైదరాబాద్‌లోనే నిర్వహించారు. అయితే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే వేదికగా తిరుపతిని ఖరారు చేశారు. దీనిపై తెలంగాణ తెలుగు తమ్ముళ్లు కొంత నిరాశ చెందుతున్నారు. అయితే పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనన్నారు.