సిద్ధూపై వేటు..కర్ణాటక ముఖ్యమంత్రిగా మల్లిఖార్జున ఖర్గే..?

కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. అంతా భావించినట్టుగానే వరుస వివాదాలతో పార్టీ పరువు దెబ్బతీస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై వేటు వేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ రెడీ అవుతోంది. అందులో భాగంగా సిద్దూ స్థానంలో లోక్‌సభలో ప్రతిపక్షనేతగా ఉన్న మల్లిఖార్జున ఖర్గేను ముఖ్యమంత్రిగా నియమించాలని సోనియా భావిస్తున్నట్టు సమాచారం. ఖరీదైన హాబ్లేట్ వాచీ పెట్టుకుని కనిపించడంతో అది ఎక్కడ నుంచి వచ్చిందంటూ సిద్థరామయ్యపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. దీంతో ఆయన అసెంబ్లీ సాక్షిగా వివరణ ఇచ్చుకుని చివరికి వాచీని రాష్ట్ర ఖజానాకు ఇచ్చివేయడంతో వివాదం ముగిసింది.

 

వాచీ వ్యవహారంలో పీకల్లోతు కూరుకున్న ఆయన ఏసీబీ ఏర్పాటుతో తీవ్ర విమర్శలపాలయ్యారు. రాష్ట్రానికే పేరు ప్రతిష్టలు తీసుకువచ్చిన లోకాయుక్తను కాదని సీఎం ఏసీబీని ఏర్పాటు చేయడంపై కన్నడిగులతో పాటు ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశాయి. మరోసారి సీఎం పుత్ర వాత్సల్యం ఆయన చేత మరో తప్పు చేయించింది. సిద్దూ కుమారుడు డాక్టర్ యతీంద్ర డైరెక్టర్‌గా ఉన్న మ్యాట్రిక్ ఇమేజింగ్ సొల్యూషన్ సంస్థకు ప్రభుత్వ వైద్య కళాశాల నిర్వహణలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో డయాగ్నస్టిక్ ల్యాబ్‌ను ఏర్పాటుచేయడానికి కాంట్రాక్ట్ వచ్చింది. దీనిని తన పుత్రరత్నానికి కట్టబెట్టి వివాదంలోకి కూరుకున్నారు సీఎం.

 

ముఖ్యమంత్రి వరుస వివాదాలపై ఒక కన్నెసిన హైకమాండ్ పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌ని ఢిల్లీకి పిలిపించింది. ఆయన తాజా పరిస్థితిని పెద్దలకు వివరించారు. ఈ క్రమంలో దక్షిణాదిలో తాను అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కావడంతో కాంగ్రెస్ ఆచితూచి స్పందిస్తోంది. ఈ క్రమంలోనే సిద్ధూకి ఉద్వాసన పలికి..ఆయన స్థానంలో ఖర్గేని సీఎం చేయాలని సోనియా నిర్ణయించినట్టు తెలుస్తోంది. తనకు అప్పగించిన పనిని తూచా తప్పకుండా చేయటమే కాకుండా..మోడీ సర్కార్ మీద అవసరానికి తగ్గట్టు నిప్పులు చెరిగే ఖర్గే రుణాన్ని సోనియా ఈ రకంగా తీర్చుకోదలచారు. తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే సిద్థరామయ్యని సీఎం నుంచి తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.