అద్వానీకి భారతరత్న..?

భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీని దేశ అత్యున్నత పురస్కరం భారతరత్న వరించబోతుందా అంటే అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు. రాష్ట్రపతి అభ్యర్థిగా అద్వానీ పేరు తొలి నుంచి వినిపిస్తున్నప్పటికీ చివరి నిమిషంలో రామ్‌నాథ్ కోవింద్ అనూహ్యంగా తెరపైకి వచ్చారు. తీరా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నైనా అవకాశం దక్కుతుందని ఆయన మద్దతుదారులు భావించారు. చివరకు అది కూడా వెంకయ్య నాయుడికి దక్కడంతో అద్వానీ వర్గం మనస్తాపానికి గురైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

 

1942లో ఆర్ఎస్ఎస్‌లో చేరినప్పటి నుంచి నేటి వరకు కమలానికి దేశవ్యాప్తంగా పాపులారిటీని తీసుకురావడంలోనూ..కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంలోనూ అద్వానీ కీలకపాత్ర పోషించారు. అప్పట్లో ఉప ప్రధానిగా చేసిన తర్వాత 2014లో ప్రధాని అభ్యర్థి ఆయనే అన్న ప్రచారం జరిగింది..కానీ మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం..ఆ ఎన్నికల్లో మోడీ గెలవడం అన్ని వెనువెంటనే జరిగిపోయాయి. అయితే కోర్టు కేసులు, నేరారోపణలు ఉన్నాయన్న కారణంతో రాష్ట్రపతి పదవి విషయంలో అద్వానీని పక్కనబెట్టారని కొంతమంది కమలనాథులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కురువృద్ధుడిని సంతృప్తి పరిచే పనిలో పడిందట బీజేపీ అధిష్టానం. దీనిలో భాగంగా భారతరత్న పురస్కరాన్ని ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తోందని సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనే విషయం ఉందా లేదా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.