తెల్లరేషన్ కార్డుదారులకు 202 మద్యం షాపులు
posted on Mar 31, 2012 10:26AM
రాష్ట్రంలో మద్యంషాపులను ఏర్పాటుచేయాలంటే మాటలు కాదు. కోట్లాది రూపాయలు కుమ్మరిస్తే తప్ప మద్యం షాపులు దక్కలేదు. అయితే ఉత్తరాంధ్రలో అతి నిరుపేదలు కూడా మద్యం షాపులను నెలకొల్పగలిగారు. వీరికి ఉండేది తెల్లరేషన్ కార్డులే అయినా కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి మద్యం షాపులను వేలంలో పాడుకున్నారు. వినడానికే ఈ విషయం వింతగా ఉన్నప్పటికీ అది పచ్చినిజం. తెలుగువన్.కామ్ సర్వే ప్రకారం ఉత్తరాంధ్రలోని 202 మద్యం షాపులను తెల్లరేషన్ కార్డులు ఉన్న నిరుపేదలు నెలకొల్పారు. వీరిలో 160 మందికి అసలు తమ పేరిట మద్యం షాపులు ఉన్నట్లే తెలియదు.
అసలు జరిగిందేమిటంటే బాగా బలిసిన మద్యం వ్యాపారులు తమ పేరుతో షాపులు తీసుకుంటే రకరకాల ఇబ్బందులు రావచ్చుననే భయంతో తమకు తెలిసిన నిరుపేదలను బినామీలుగా పెట్టి వారి పేరిట లైసెన్స్ లు తెచ్చుకున్నారు. ఈ సహాయం చేసినందుకు ఈ బడుగు వర్గాలకు నెలకు నాలుగైదు వేల రూపాయలు జీతంగా ఇచ్చి సంతోషపరుస్తున్నారు. అయితే తెల్లరేషన్ కార్డులున్న నిరుపేదలు కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ఎలా లైసెన్స్ లు పొందగలిగారన్న అంశాన్ని ఎక్సైజ్ శాఖ కూడా ఎప్పుడూ పట్టించుకోలేదు. ఎసిబి దాడుల తరువాతే ఈ ప్రహాసనాలన్నీ ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. చాలా చోట్ల ఎసిబి దాడుల తరువాతే ఈ ప్రహాసనాలన్నీ ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. చాలా చోట్ల ఎసిబి దాడుల తరువాత మద్యం వ్యాపారులు పరారయ్యారు. కానీ వారి బినామీలుగా ఉన్న నిరుపేదలు మాత్రం ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు.