బెల్టును తీస్తున్న మద్యం వ్యాపారులు

ఎసిబి దాడుల నేపథ్యంలో కొద్దికాలం భయపడుతున్నట్లు నటించిన మద్యం వ్యాపారులు మళ్లీ రెచ్చిపోతున్నారు. గతంలో మూసివేసిన బెల్టుషాపులను మళ్లీ తెరుస్తున్నారు. కొన్ని చోట్ల గతంలో లాగే ఎంఆర్ పిపై పది నుంచి పదిహేను శాతం ఎక్కువ రేటుకు మద్యాన్ని విక్రయిస్తున్నారు. తమకు ట్రాన్స్ పోర్టు ఖర్చులు అవుతాయి కనుక అదనపు ఛార్జీలు ఇవ్వాల్సిందేనంటూ వారు పట్టుబడుతున్నారు. ఎంఆర్ పిపై అదనపు వసూళ్లతో పాటు మారుమూల ప్రాంతాల్లో కల్తీమద్యాన్ని ముమ్మరంగా విక్రయిస్తున్నారు. ముఖ్యంగా బెల్టుషాపుల్లో ఈ తంతు జరుగుతున్నా ఎక్సయిజ్ శాఖ మామూలుగానే నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తోంది. దర్యాప్తులు జరుగుతాయి అయినా మాకేంటి అన్నట్లుగా కిందిస్థాయి సిబ్బంది యథావిథిగా మామూళ్లను వసూలు చేస్తున్నారు. బెల్టుషాపుల్లో కల్తీ మద్యాన్ని విక్రయిస్తుండటంతో వాటిని తాగుతున్న పేదప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. రాష్ట్రప్రభుత్వం ఎన్నికల హడావుడిలో పడటం ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల బదిలీలతో అయోమయంగా మారడంతో మద్యం వ్యాపారులు చెలరేగిపోతున్నారు.అంతేకాక ఎన్నికల పుణ్యమా అని మద్యం విక్రయాలు కూడా బాగా ఊపందుకున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu