అబ్బాయి పార్టీలో చేరనున్న బాబాయి
posted on May 23, 2012 2:22PM
వైఎస్ఆర్ సోదరుడు వైఎస్.వివేకానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి, అబ్బాయి జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న కీలక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. వైఎస్‌ఆర్‌ను విమర్శిస్తూ ప్రచారంలోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కూడా వివేకా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైఎస్‌ఆర్ జిల్లాలో మూడు చోట్ల ఉప ఎన్నికలు జరుగుతున్నా కీలకమైన నాయకుడుగా ఉన్న వివేకాకు ఎక్కడా బాధ్యతలను అప్పజెప్పలేదు. తగిన ప్రాతినిథ్యం కూడా ఇవ్వలేదు. ఈ పరిణామాలన్నీ బేరీజు వేసిన వైఎస్.వివేకానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీకి స్వస్తి చెప్పాలన్న ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఈరోజు ఆయన కడప జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్తును తన కార్యకర్తలే నిర్ణయిస్తారని చెప్పారు. సాయంత్రం లోపు కార్యకర్తలు కార్యాచరణ నిర్ణయిస్తారని చెప్పారు. తనకు కాంగ్రెసులో ఉండాలనిపించడం లేదన్నారు. పార్టీ కోసం కుటుంబాన్ని వదిలేసినప్పటికీ తనకు కాంగ్రెసులో ప్రాధాన్యం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ను అందరూ దోషిగా చేసి మాట్లాడుతున్నారన్నారు. తన రాజకీయ భవిష్యత్తు నిర్ణయించమని కార్యకర్తలను కోరానని అన్నారు.